‘బాహుబలి’ (Baahubali) రెండు సినిమాలతో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ అయిపోయింది ఆర్కా మీడియా. అయితే అప్పటికే వాళ్లు టీవీ రంగంలో, ఓటీటీల్లో ఇతర భాషల్లోనూ ప్రాజెక్ట్‌లు చేసి పరిచయం ఉన్నారనుకోండి. అయితే ఆ సినిమాలతో సినిమా రంగంలో పాన్ ఇండియా ప్రొడ్యూసర్‌లు అయిపోయారు. అయితే ఆ సినిమాలు వచ్చి ఏడేళ్లు అవుతున్నా.. ఇంకా ఆ స్థాయి సినిమా అనౌన్స్ చేయలేదు. ఏవో రెండు చిన్న సినిమాలు చేశారు అంతే. దీంతో ‘బాహుబలి’ భారీ నిర్మాతలు ఏరి అనే ప్రశ్న వస్తోంది….
దీనికి సమాధానం ఇప్పుడు దొరికింది అని చెప్పాలి. ఎందుకంటే ఆర్కా నిర్మాతలు ప్రసాద్ దేవినేని (Prasad Devineni) , శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) కొత్త సినిమాను స్టార్ట్ చేసే పనిలో ఉన్నారట. అది కూడా రానా (Rana Daggubati) లాంటి పాన్ ఇండియా స్టార్‌తోనే ఆ సినిమా చేస్తుననారు. అంటే ఈ సినిమా వివిధ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ‘విరాట పర్వం’ (Virata Parvam) సినిమా తర్వాత రానా నుండి పూర్తి స్థాయి హీరో సినిమా రాలేదు.
ఆ మధ్య తేజ (Teja) దర్శకత్వంలో ‘రాక్షస రాజు’ అనే సినిమా ఖరారైనా ఇంకా పట్టాలెక్కలేదు, ఆ అవకాశం కూడా లేదు అని టాక్. దీంతో రానా ఇప్పుడు రజనీకాంత్ (Rajinikanth) ‘వేట్టయాన్’ (Vettaiyan) సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు పూర్తి స్థాయి సినిమా ఓకే చేశారు అని టాక్. కొత్త దర్శకుడు కిశోర్ చెప్పిన కథకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ సినిమానే ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తోందని టాక్.
ఈ సినిమాలో కథానాయికగా శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అక్టోబరులో ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ లోపు రానా తన బాబాయ్ వెంకటేశ్‌తో (Venkatesh Daggubati) కలసి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu) రెండో భాగం పనులు పూర్తి చేసుకుంటారట. ఆ తర్వాతనే ఆర్కా వాళ్ల సినిమా అంటున్నారు.