భారతీయ సినిమాలకు జపాన్‌లో ఆదరణ బాగుంటుంది. ముఖ్యంగా సౌత్ నుండి వెళ్లిన సినిమాలకు ఇంకా ఎక్కువ ఆసక్తి ఉంటుంది. రీసెంట్‌గా జపాన్ వెళ్లిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎంతటి విజయం అందుకుందో మనందరికీ తెలిసిందే. ఆ స్థాయిలో కాకపోయినా అక్కడి అభిమానుల కోసం మరో తెలుగు సినిమా రెడీ అవుతోంది. రామ్‌చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన ‘రంగస్థలం’ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్స్ వేస్తున్నారు. రామ్ చరణ్‌ను ఇప్పుడు అభిమానులు గ్లోబల్ స్టార్ అని పిలుచుకుంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల తర్వాత ప్రపంచవ్యాప్తంగా చరణ్ అభిమాన గణం పెరిగింది. ఆయన గత సినిమాలను చూడాలని కోరుకుంటున్నారు. దీని కోసం ఓటీటీలు, యూట్యూబ్‌ను జల్లెడ పట్టేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో నటుడిగా రామ్ చరణ్ స్థాయిని పెంచిన ‘రంగస్థలం’ సినిమాను గ్లోబల్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. అందులో భాగంగా జపాన్‌లో విడుదల చేస్తున్నారు. గోదావరి నేపథ్యంలో పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ కొత్తగా కనిపించాడు.
అప్పటివరకు కనిపించని చరణ్ ఆ సినిమాలో కనిపించాడు అని చెప్పొచ్చు. నటన, డిక్షన్, అప్పీయరెన్స్ ఇలా అన్నీ అదిరిపోతాయి. ఆ సినిమాను (Rangasthalam) జపాన్‌లో తాజాగా విడుదల చేయనున్నారు. ఈ నెల 9 నుండి 11 వరకు జపాన్‌లోని చొగో సిటీలో ఒక్కో షో వేస్తున్నారు. ఆ తర్వాత షోలు పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. వీకెండ్‌లో ఈ షోస్ ఉండేలా చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రస్తుతం జపాన్‌లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
భారీ వసూళ్లతో ఈ సినిమా జపాన్ బాక్సాఫీసు దగ్గర దూసుకుపోతోంది. అది కూడా ‘రంగస్థలం’ సినిమాకు ఉపయోపడుతుంది అని చెప్పొచ్చు. చరణ్ అనే ట్యాగ్ ఒకవైపు, ‘ఆర్‌ఆర్‌ఆర్’ హీరో అనే ట్యాగ్ మరోవైపు ‘రంగస్థలం’ జపాన్ రిలీజ్‌కు సహకరిస్తుందని చెప్పొచ్చు. అయితే ఆ సినిమా స్థాయిలో స్పెషల్ ఎఫెక్ట్స్, భారీతనం ఈ సినిమాలో ఉండవు. కాబట్టి ఎమోషన్స్ కనెక్ట్ అయితే ఈ సినిమా కూడా జపాన్‌లో అదరగొడుతుంది అని చెప్పొచ్చు.