రంగు

“బిగ్ బాస్” షోతో అప్పటివరకూ కోల్పోయిన పాపులారిటీని మళ్ళీ సొంతం చేసుకొన్న తనీష్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ డ్రామా “రంగు”. విజయవాడకు చెందిన “లారా” అనే రౌడీ షీటర్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ (నవంబర్ 23) విడుదలైంది. మరి ఈ చిత్రంతో తనీష్ తాను కోల్పోయిన స్టార్ డమ్ ను తిరిగి పొందాడా లేదా? అనేది చూద్దాం..!!

కథ : టెన్త్ తో స్టేట్ ర్యాంక్, ఇంటర్ లోనే స్టేట్ సెకండ్ స్థాయి ప్రతిభ కనబరిచిన పవన్ కుమార్ అలియాస్ లారా (తనీష్) డిగ్రీకి వచ్చేసరికి మాత్రం గొడవలు పడుతూ మెలమెల్లగా రౌడీల తయారవుతాడు. కాలేజ్ గ్రూప్ గొడవలు కాస్తా రోడ్డు మీద కనీసం పరిచయం లేని వ్యక్తిని చాలా చిన్న గొడవ కారణంగా చంపేలా చేస్తుంది. తొలుత ఆ కేస్ నుంచి తన లాయర్ సాయంతో తప్పించుకొన్నా.. అనంతరం అదే కేస్ కారణంగా రౌడీ షీటర్ అయిపోతాడు లారా. పోలిటికల్ సపోర్ట్ కూడా దొరకడంతో సెటిల్ మెంట్స్ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో విజయవాడకు కొత్తగా వచ్చిన ఏసీపీ (పరుచూరి రవి) సిటీలో గ్యాంగ్ వార్స్ లేకుండా చేసేందుకు వేసిన ప్రణాళికలో భాగంగా అందరు రౌడీ షీటర్స్ ని కలిసి.. ఇవన్నీ మానేయమని చెబుతాడు.

కానీ.. అప్పటికే తనకున్న ఆవేశం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్న లారాను ఏసీపీ బ్రతికించగలిగాడా? ఒక మామూలు మనిషిగా లారా మారగలిగాడా లేక రౌడీ షీటర్ గానే మిగిలిపోయాడా? అనేది “రంగు” కథాంశం.

నటీనటుల పనితీరు : తన కెరీర్ లో తనీష్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. లారా పాత్రకు జీవం పోయడానికి చాలా కష్టపడ్డాడు. అయితే.. పాత్రలోని ఇంటెన్సిటీ అతని కళ్ళలో కనిపించి కానీ.. బాడీ లాంగ్వేజ్ లో మాత్రం ఎక్కడా కనిపించలేదు. పైగా.. తనీష్ వయసుకి ఈ పాత్ర కాస్త పెద్దది అనిపించింది. ఒక మెచ్యూర్డ్ అమ్మాయి పాత్రలో ప్రియా సింగ్ నటన బాగుంది.

తనీష్ తర్వాత సినిమాలో ఆకట్టుకొన్న నటుడు షఫీ. మణి పాత్రలో డిఫరెంట్ షేడ్స్ & ఎమోషన్స్ ను అద్భుతంగా పండించాడు. సినిమాలో అతడి పాత్ర చాలా కీలకం.

పరుచూరి రవి పోషించిన ఏసీపీ క్యారెక్టర్ కు ఉన్న డెప్త్ & ఇంటెన్సిటీ అతడి నటనలో కనిపించలేదు. జగపతిబాబు లేదా ఆస్థాయి నటుడు ఎవరైనా ఈ పాత్ర చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. పోసాని నవ్వించడానికి కాస్త ప్రయత్నించాడు.

సాంకేతికవర్గం పనితీరు : ముందుగా దర్శకుడు కార్తికేయను అభినందించాలి. నాలుగేళ్లపాటు కష్టపడి కథ రాసుకోవడమే కాక.. కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటి వాటి కోసం అనవసరమైన డీవియేషన్స్ తీసుకోకుండా.. నిబద్ధతతో సినిమాని తెరకెక్కించాడు. తాను అనుకున్న కథను చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించిన కార్తికేయ.. లారా జీవితంలోని ఒడిదుడుకులను, చీకటి కోణాలను మాత్రమే స్పృశించి వదిలేయడంతో.. సినిమా మొత్తం సీరియస్ టోన్ తోనే సాగుతుంది. అలాగని సినిమాలో ఎంటర్ టైన్మెంట్ ఎవరూ కోకుకోరు. కాకపోతే.. ఒక మనిషి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా కాబట్టి.. అన్నీ కోణాల్ని టచ్ చేసి ఉంటే బాగుండేది.

సంగీత దర్శకుడు యోగీశ్వర శర్మ సినిమాలోని కంటెంట్ కు తగ్గ నేపధ్య సంగీతాన్ని సమకూర్చాడు. పాటలు కూడా పర్వాలేదు అనిపించాయి. సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నేచురల్ గా ఉంది. 90ల కాలం నాటి బెజవాడను మళ్ళీ కళ్లకు కట్టినట్లుగా చూపించారు చిత్రబృందం.

విశ్లేషణ : “రంగు” ఒక రౌడీ షీటర్ జీవితం. తనకు తెలియకుండానే రౌడీ షీటర్ గా మారిపోయిన ఓ యువకుడు మళ్ళీ సాధారణ జీవితం గడపడం కోసం పడిన శ్రమ.. అందుకు పోలీసులు ఎలా సహకరించారు అనేది కథాంశంగా తెరకెక్కిన చిత్రమిది. సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. కాకపోతే.. సినిమా మొత్తం ఈ పరుగులేనా అనిపిస్తుంటుంది. లారా జీవితంలోని మిగతా కోణాల్ని కూడా టచ్ చేసి ఉంటే సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొనేది. ఓవరాల్ గా.. ఒక డీసెంట్ అటెంప్ట్ “రంగు”.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus