బాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్స్ లలో రాణీ ముఖర్జీ ఒకరు. ఇరవై ఏళ్లుగా అనేక సినిమాల్లో నటించి విజయాలను అందుకున్నారు. ఇటీవలే యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకున్నాక నటనకు కొంత బ్రేక్ ఇచ్చారు. అదిరా అనే పాపకు తల్లి అయిన తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. హిచ్కీ అనే మూవీ చేశారు. ఎక్కిళ్ల సమస్య ఉన్న నయన అనే టీచ్ కథ ఇది. ఈ మూవీ విడుదలై ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ నుంచి సైతం ప్రశంసలు పొందారు. ఇటీవల ఆస్ట్రేలియాలో ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ అవార్డు వేడుకలో ‘హిచ్కీ’ సినిమాకు గానూ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. “ఓ నటిగా నాలో మార్పు రావడానికి విశ్వనటుడు కమల్ హాసనే కారణం. నా సినీ కెరీర్‌లో కమల్ హాసన్‌తో కలిసి నటించిన ‘హే రామ్’ సినిమా టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. చిత్రీకరణలో భాగంగా ఓసారి సెట్‌కు వెళ్లాను.
అప్పుడు కమల్ నన్ను చూసి మేకప్ తీసేయాలని చెప్పారు. నేను ఆయన చెప్పినట్లుగానే చేశాను. సెట్‌లో నేను మేకప్ లేకుండా ఉండడం అదే మొదటిసారి. కానీ చాలా కాన్ఫిడెంట్‌గా అనిపించింది.” అని గుర్తుచేసుకున్నారు. ఇంకా మాట్లాడుతూ “ఆ తర్వాత చిత్రీకరణలో భాగంగా మళ్లీ మేకప్ వేసేవారు. కానీ కమల్ హాసన్ నాలో ఎంతో మార్పును తెచ్చారు. నాకు తెలిసినంతవరకు ఓ ఆర్టిస్ట్ అందం, జుట్టు, బరువు గురించి పట్టించుకోకూడదు. వారి లక్ష్యం నటనపైనే ఉండాలి. అప్పుడే మనలోని నటనా నైపుణ్యాలు బయటికి వస్తాయి” అని రాణి ముఖర్జీ వెల్లడించారు. ఇలా కమల్ హాసన్ నేటి తరం వారికీ స్ఫూర్తిగానే కాకుండా మార్గదర్శకంగా నిలిచారు.