ఆ హీరోయిన్ గ్లామర్ డాల్‌లా కనిపిస్తోంది కదా.. అలాంటి పాత్రలే ఆఫర్ చేద్దాం అనుకుంటూ ఉంటారు మన సినిమా పరిశ్రమలో. మరో రకం సినిమాలు చేద్దామన్నా ‘మీకు ఈ సినిమాలే బాగుంటాయి’ అని కూడా అనేస్తుంటారు. అందుకేనేమో పక్క భాషలకు వెళ్లి తమ ప్రతిభను చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడా కుదరకపోతే ఏ ఇంటర్వ్యూలోనో తమ మనసులో మాట బయటపెడతారు. ఇప్పుడు అదే పని చేసింది ప్రముఖ కథానాయిక రాశీ ఖన్నా. తనకు ఎలాంటి సినిమా చేయాలని ఉందో చెప్పుకొచ్చింది.
‘తెలుసు కదా’ అంటూ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది రాశీ ఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ సినిమా విడుదల సందర్భంగా రాశీ ఖన్నా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిత్ర పరిశ్రమలో ఏదైనా సరే దానంతట అదే జరుగుతుంది. మనం ప్లాన్స్ వేసుకున్నంత మాత్రాన అలాగే జరుగుతుందని చెప్పలేం అని చిన్న వేదాంతం టచ్ ఇచ్చింది.
తనకు ఇష్టమైన పాత్రల గురించి చెబుతూ.. పురాణాల నేపథ్యంలో వచ్చే కథలంటే ఇష్టమని చెప్పిన రాశీ ఖన్నా హారర్ కథల్లో నటించడమంటే ఆసక్తి అని చెప్పుకొచ్చింది. అలాగే హారర్ సినిమాలు చూడటం అంటే నచ్చుతుంది అని చెప్పింది. మరి ఇప్పుడు రాశీ కోసం ఇలాంటి కథలు రాసేది ఎవరు అనేది చూడాలి. కెరీర్ దాదాపు ఆఖరి దశలో ఉన్న రాశీకి ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయాలి అనే ఆలోచన రావడం.. కాస్త ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి.
పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో నటిస్తున్నారు కదా.. ఏంటి సంగతి అని అడిగితే.. దర్శకుడు హరీష్ శంకర్ ఆ సినిమా కోసం ఫోన్ చేయగానే మరో మాట లేకుండా సినిమాకి ఓకే చెప్పా అని ఆ రోజుల్ని గుర్తు చేసుకుంది. ఓకే చెప్పాకనే సినిమా కథ విన్నా అని చెప్పింది.