ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ.. అందాలతో అలరించే రష్మీకి అరుదైన వ్యాధి ఉన్న సంగతి రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. రుమటాయిడ్ వ్యాధిని అధిగమించి ఆమె యాంకర్ గా రాణిస్తోంది. అందుకు ఆమె అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది రష్మీని ఆ వ్యాధి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికపై… “నా భర్త నాలుగేళ్లుగా రుమటాయిడ్స్‌తో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఎక్కడికి వెళ్లాలో తెలీడం లేదు. ఒకప్పుడు మీరూ రుమటాయిడ్‌తో బాధపడిన వారే కదా.. మీరేదన్నా సూచనలివ్వగలరా?” అని అడిగారు. ఇందుకు రష్మి సమాధానమిస్తూ.. “ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స అంటూ లేదు. మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతోనే మార్పు కనబడుతుంది. ఆయుర్వేద మందులు వాడి చూడండి.
ఇటీవల నాకు ఆటో ఇమ్యూన్ సమస్యలు ఎదురైనప్పుడు స్టెరాయిడ్లు తీసుకున్నాను. 12 ఏళ్ల వయసులో దాదాపు ఐదేళ్ల పాటు రుమటాయిడ్స్ నుంచి విముక్తి పొందడానికి తీవ్రంగా నొప్పి కలిగించే ఇంజెక్షన్లు తీసుకున్నాను. ఆ తర్వాత మా అమ్మ చెప్పిన కొన్ని చిట్కాల వల్ల బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. నొప్పితో బాధపడటం అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే. అలాగని నొప్పికే పరిమితం అయిపోకుండా రోజూ వ్యాయామం, నడక వంటివి చేస్తూ ఉండాలి. తాజా ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాదు మనకి ఒత్తిడి కలిగించి, వెనక్కి నెట్టాలని ప్రయత్నించే వ్యక్తులకు దూరంగా ఉండాలి” అని చెప్పింది. ఇలా వ్యాధి గురించి అవగాహన కల్పిస్తున్న రష్మీని నెటిజనులు అభినందిస్తున్నారు.