Rashmika: ఎన్నికల సమయంలో ‘యాడ్‌’ చేసి నానా బాధలు పడుతున్న రష్మిక

ఇండియన్‌ సినిమా కుర్రాళ్ల గుండెల్ని క్రష్‌ చేసిన రష్మిక (Rashmika Mandanna) అలియాస్‌ క్రష్మిక ఇప్పుడు పొలిటికల్‌ చిక్కుల్లో పడిందా? ఏమో ఆమె రీసెంట్‌గా చేసిన ఓ యాడ్‌ కాని యాడ్ వల్ల నానా బాధలు పడుతోంది. ముంబయిలోని ఓ బ్రిడ్జి గొప్పతనం గురించి ఇటీవల ఆమె ఓ వీడియో తన సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. అయితే ఆ వీడియో ఇప్పుడు ఆమెను కొంతమంది విమర్శించే పరిస్థితికి తీసుకొచ్చింది. ఎన్నికల సమయంలో ఆమె ఇలా ఓ పార్టీకి సహకరించేలా వీడియో చేయడం సరికాదు అనేది వారి మాట.

‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు ‘యానిమల్’ (Animal) సినిమాతో బాలీవుడ్‌లో భారీగా అభిమానులను అందుకుంది రష్మిక. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ తరఫున అనధికార ప్రచార కర్త అనేలా ఆమె ఇటీవల ఓ పోస్టు చేసింది. ప్రఖ్యాత అటల్ సేతు బ్రిడ్జ్ ని పొగుడుతూ వీడియో సిద్ధం చేసి (చేయించి) ట్వీటు చేసింది. నరేంద్ర మోడీ సర్కారును ప్రశంసిస్తూ ఎన్నికల సమయంలో ఆ వీడియో రావడంతో రష్మిక ఇబ్బందుల్లో పడింది.

మరోవైపు కొంతమంది రష్మికకు రూ. కోట్ల పన్ను బకాయిల సమస్య ఉందని, దాని నుండి బయట పడటానికే ఇలా యాడ్‌ చేసింది అంటూ కొత్త కథలు అల్లేస్తున్నారు. వీటిలో నిజం ఎంతవరకు అనేది మనం చెప్పలేం కానీ.. ఆమె మాత్రం ఆ యాడ్‌ లాంటి వీడియో చేసి విమర్శలు పాలైంది అని మాత్రం చెప్పొచ్చు. రాజకీయ నాయకులకు సినిమా వాళ్లు సహాయం చేయడం కొత్త కాదు. కానీ స్టార్‌గా ఉన్న ఈ సమయంలో ఎందుకు అనేదే ప్రశ్న.

గతంలో ఇలానే కన్నడ సినిమా పరిశ్రమ అభిమానులతో రష్మిక సున్నం పెట్టుకుంది. దీంతో ఆమెను నిషేధిస్తారు అంటూ ఓ చర్చ మొదలైంది. ఇప్పుడు మరోసారి ఆమె లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంది అని చెప్పొచ్చు. మరి దీనికి నష్టనివారణ చర్యలు ఆమె ఏం తీసుకుంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus