Rashmika: ‘సీతారామం’ గురించి వైరల్‌ టాక్‌.. నిజమేనా?

  • July 27, 2022 / 12:36 PM IST

సినిమా టీజరో, ట్రైలరో చూసి కథేంటో చెప్పేయొచ్చా? అన్నివేళలా ఇది సాధ్యం కాదు కానీ, కొన్నిసార్లు వీలవుతుంది. ఇప్పుడు ‘సీతా రామం’ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుందా? అవుననే అనిపిస్తోంది సోషల్‌ మీడియాను చూస్తుంటే. హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం’ ట్రైలర్‌ ఇటీవల విడుదలై మంచి బజ్‌ సంపాదించింది. సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సీతామహాలక్ష్మి, లెఫ్టినెంట్‌ రామ్‌ల ప్రేమ కథ ఈ సినిమా అని అనుకుంటుండగా, కాదు కాదు ఇది నా కథ అంటూ మధ్యలో అఫ్రీన్‌ చెబుతుంది ట్రైలర్‌లో.

దీంతో ఈ సినిమా కథ ఏమై ఉండొచ్చు అని ఓ చర్చ నడుస్తోంది. ‘సీతారామం’ సినిమాను ఇప్పటివరకు దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రలుగా పరిచయం చేశారు. చాలా రోజులుగా సినిమా అంటే వీళ్లే అని చూపిస్తూ వచ్చారు. అయితే ట్రైలర్‌ మాత్రం అందుకు భిన్నంగా కనిపించింది. ట్రైలర్‌లో రష్మిక మందన పాత్ర కీలకంగా కనిపించింది. దీంతో ఈ సినిమాలో మెయిన్‌ క్యారెక్టర్స్‌ మూడు అని తెలుస్తోంది. ట్రైలర్‌ ప్రకారం చూస్తే… ఈ సినిమా 20 ఏళ్ల ముందు, 20 ఏళ్ల తర్వాత అనే కాన్సెప్ట్‌లో రన్‌ అవుతోంది.

ఈ మొత్తం లెక్కలను ఓ దగ్గరేస్తే ఈ సినిమాలో అఫ్రీన్‌ పాత్ర సీతారామం కూతురు అవ్వొచ్చు అని అంటున్నారు. అనూహ్య పరిస్థితుల్లో తల్లిదండ్రులకు దూరమై అఫ్రీన్‌గా పెరిగిన రష్మిక.. అనుకోని పరిస్థితుల్లో సీతారామం గురించి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో వాళ్లు తన తల్లిదండ్రులు అని తెలుసుకుంటుంది అని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, హను రాఘవపూడి మామూలుగా ఊహలకు అందని కథలను తీసుకొస్తుంటారు. ఇప్పుడు ఈ సినిమా కథను నెటిజన్లు ఊహించినట్లుగా తీసి ఉంటారా? అనేది చూడాలి.

ఇక ఈ సినిమా గురించి చూస్తే… ‘‘20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్‌ రామ్‌ నాకొక బాధ్యత అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి’’ అని సంభాషణలతో ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘‘సీతను ఎలా పట్టుకోవాలి. నాకింకా పది రోజులే సమయం ఉంది. రామ్‌ గురించి తెలిస్తే సీతను పట్టుకోవడం ఈజీ’’ అంటూ రష్మిక డైలాగ్‌లో ఆసక్తిరేగుతుంది. ‘‘నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కశ్మీర్‌ని మంచుకు వదిలేసి వస్తారా’’ అని రామ్‌ను సీత అడుగుతుంది.

‘‘నా పాటికి నేను అనాథలా బతికేస్తుంటే ఉత్తరాలు రాసి ఇబ్బందిపెట్టింది కాకుండా దారి ఖర్చులు ఇస్తానడం న్యాయమా?’’ అని రామ్‌ అడుగుతాడు. ‘‘నేనిక అనాథను కాదు కదా’’ అంటూ అఫ్రీన్‌ చెబుతుంది. ఇవన్నీ చూస్తుంటే సోషల్‌ మీడియా కథ నిజమే అనిపిస్తోంది. అసలు విషయం తేలాలంటే… ఆగస్టు 5 వరకు ఆగాలి. ఎందుకంటే ఆ రోజే సీతారామం, అఫ్రీన్‌ థియేటర్లలోకి వస్తారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus