జాతీయ చలన చిత్ర పురస్కారం… ఇది దక్కితే నటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు వచ్చే కిక్కే వేరు. దేశవ్యాప్తంగా తమ సినిమాకు పేరొచ్చింది అంటూ గొప్పగా చెప్పుకుంటారు. అంతటి ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో తప్పు జరిగిందా? అవుననే అంటున్నారు ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పుకుట్టి. ఆస్కార్ పురస్కార గ్రహీత అయిన ఆయన.. ఇటీవల ఓ సినిమాకు పురస్కారం దక్కిన విషయంలో ఆయన కొన్ని రోజుల క్రితం సీరియస్ కామెంట్స్ చేశారు. అయితే ఇప్పడు ఆ ట్వీట్ కింద చర్చ జరుగుతోంది.
రసూల్ ట్విటర్ ఖాతాలో ‘డొల్లు’ అనే కన్నడ సినిమా గురించి కీలక విషయం వెల్లడించారు. 68వ జాతీయ పురస్కారాల్లో భాగంగా ఇటీవల సింక్ సౌండింగ్ / బెస్ట్ ఆడియో గ్రఫీ విభాగంలో ‘డొల్లు’ అనే కన్నడ సినిమాకు పురస్కారం ప్రకటించారు. త్వరలో పురస్కారాలు అందిస్తారు కూడా. ఈ సమయంలో ఆయన ఆ పురస్కారానికి ఆ సినిమాను ఎంపిక చేయడమే సరికాదు అంటూ కొన్ని వివరాలు తెలిపారు. దీంతో జాతీయ పురస్కారాల ఎంపికలో తప్పిదమా అంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.
ఈ సినిమాకు గాను సౌండ్ రికార్డిస్ట్ జొబిన్ జయన్‌కు పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ‘డొల్లు’ సినిమా కోసం సింక్ సౌండ్ రికార్డింగ్ చేయలేదని రసూల్ చెబుతున్నారు. అంతేకాదు అది డబ్బింగ్ సినిమా కూడా అని ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆ సినిమాకు సౌండ్ డిజైనర్‌గా పని చేసి నితిన్ లుకోస్ తనకు చెప్పారని కూడా రాశారు రసూల్ పుకుట్టి.
రెండు నెలల క్రితం రసూల్ చేసిన ఆ ట్వీట్‌ను ఇప్పుడు కొంతమంది నెటిజన్లు రీట్వీట్లు చేసి బయటకు తీసుకొచ్చారు. దీంతో ఈ విషయంలో అవార్డు సెలక్షన్ కమిటీ ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా లేదా అనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు అయితే ఈ సినిమా విషయంలో స్పందించలేదు. తాజాగా మరోసారి విషయం చర్చకు రావడంతో ఏమన్నా మార్పులు చేస్తారేమో చూడాలి.