2023లో టాలీవుడ్‌లో కొత్త హీరోలు.. అదేనండీ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్నారు.. నెపోటిజం గురించి ఎవరెన్ని రకాలుగా కామెంట్స్ చేసినా.. ఇక్కడ టాలెంట్, ప్రేక్షకాదరణ ఉంటేనే నెగ్గుకురాగలరనేది వాస్తవం.. ఈ ఏడాది రానా తమ్ముడు అభిరామ్, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ, జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది, RRR నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు, యాంకర్ సుమ కొడుకు.. ఇలా పలువురు కొత్తవారు ఎంటర్ అవబోతున్నారు.. ఈ లిస్టులో మరో వారసుడు చేరిపోయాడు..
స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాతి తరంలో మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత ఆయణ్ణి స్ఫూర్తిగా తీసుకుని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి స్వశక్తితో స్టార్‌గా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు మాస్ మహారాజా రవితేజ.. తన స్టైల్ కామెడీతో, వరుస హిట్లతో ఓ ఊపు ఊపిన రవితేజను చూసి తన ఇద్దరు తమ్ముళ్లు భరత్, రఘు కూడా సినీ రంగంలోకి వచ్చారు.. భరత్ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆకట్టుకున్నాడు కానీ అకాల మరణం చెందాడు..
రఘు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ కొన్ని సినిమాలు చేశాడు కానీ అతని కెరీర్ ఆశించినంతగా సాగలేదు.. దీంతో త్వరగానే సినిమాల నుంచి తప్పుకున్నాడు.. ఇప్పుడు ఆయన కుమారుడు మాధవ్.. పెదనాన్న రవితేజని ఆదర్శంగా తీసుకుని హీరోగా పరిచయమవుతున్నాడు.. ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు శిష్యురాలు, ‘పెళ్లిసందD’ తో దర్శకురాలిగా పరిచయమైన గౌరీ రోనంకి తెరకెక్కిస్తున్నారు.. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది..
గురువారం (మార్చి 23) న సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి.. రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లనున్నారు.. మాధవ్‌కి విషెస్ తెలియజేస్తూ రవితేజ ట్వీట్ చేశారు.. ఇక మాస్ మహారాజా తనయుడు మహాధన్ కూడా బాల నటుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే.. ‘రాజా ది గ్రేట్’ లో చిన్నప్పటి రవితేజ పాత్ర చేసి ఆకట్టుకున్నాడు.. రవితేజ నట వారసుడిగా మహాధన్ ఎంట్రీ కూడా ఉంటుందని ఇప్పటినుండే వార్తలు వస్తున్నాయి..