తెలుగు కథల మీద బాలీవుడ్‌కి మనసైంది అనేది పాత మాట. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా తెలుగు కథలను హిందీకి తీసుకెళ్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం విజయాలు దక్కుతున్నాయి కూడా. తాజాగా ఇదే వరుసలో మరో టాలీవుడ్ సినిమా బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కనుందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కథతోపాటు ఆ దర్శకుడిని కూడా తీసుకెళ్తారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆ సినిమా తెలుగు సినిమాకు కరోనా భయాన్ని దాటించినది కావడం గమనార్హం.
రెండేళ్ల క్రితం కరోనా కష్టంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. సరైన సినిమా వస్తే గానీ.. జనాలు థియేటర్లకు రారు అనుకుంటున్న సమయంలో చాలా కష్టపడి విడుదలైన చిత్రం ‘క్రాక్’. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన ఆ సినిమా భారీ విజయం అందుకుంది. వింటేజ్ రవితేజను ప్రేక్షకులకు చూపించి.. హిట్ కొట్టించారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇప్పుడు ఆ కథను బాలీవుడ్‌కి తీసుకెళ్తున్నారని వార్తలొస్తున్నాయి. బాలీవుడ్‌లో ఫుల్ ఎనర్జీని కేరాఫ్ అడ్రెస్ అయిన రణ్‌వీర్ సింగ్ ఆ సినిమాలో హీరోగా నటిస్తాడని సమాచారం.
గతంలో రణ్‌వీర్ ఖాకీ కడితే హిట్టే. ‘టెంపర్’ సినిమాను ‘సింబా’గా బాలీవుడ్‌కి తీసుకెళ్లి భారీ విజయం అందుకున్నాడు. ఇప్పుడు ‘క్రాక్’ను అదే పేరుతో బాలీవుడ్‌కి తీసుకెళ్తాడట. అయితే ఈసారి రీమేక్‌ల స్పెషలిస్ట్ రోహిత్ శెట్టిని కాకుండా మాతృకను డైరెక్ట్ చేసిన గోపీచంద్ మలినేనినే డైరెక్ట్ చేయమంటున్నారు అని చెబుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని ‘వీర సింహా రెడ్డి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానున్న నేపథ్యంలో..
ఆ తర్వాతే బాలీవుడ్ సినిమా లెక్కలు ఉంటాయి అంటున్నారు. అన్నట్లు ఇలా తెలుగు కథను బాలీవుడ్‌కి తీసుకెళ్లి ‘అర్జున్ రెడ్డి’ సందీప్ రెడ్డి వంగా భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో సినిమానే చేస్తున్నారు. అలా మరి గోపీచంద్ మలినేని కూడా వెళ్తారా? వెళ్లి విజయం సాధిస్తారా అనేది చూడాలి.