కరోనా కారణంగా చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ వదిలేసుకొని ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఒకట్రెండు మినహాయిస్తే ఇప్పటివరకు ఓటీటీలో వచ్చినవి చిన్న సినిమాలే. అయితే ఇప్పుడు సూర్య లాంటి స్టార్ హీరో నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన. ఈ సినిమా ఆన్లైన్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటన వచ్చినప్పుడు అందరూ షాక్ అయ్యారు. సూర్య లాంటి పెద్ద హీరో ఇంకొంతకాలం సినిమాను హోల్డ్ చేసి థియేటర్లో రిలీజ్ చేయలేరా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ విషయంలో తమిళనాడు ఎగ్జిబిటర్లు సూర్యతో గొడవకి దిగారు. అయినా సరే.. సూర్య మాత్రం వెనక్కి తగ్గలేదు. తనకు ఎన్ని హెచ్చరికలు వచ్చిన వెనుకడుగు వేయకుండా తన సినిమాను ప్రైమ్ లో రిలీజ్ చేశాడు. అయితే ఇది తాను ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం కాదని సూర్య తాజాగా వెల్లడించాడు. థియేటర్ల పునః ప్రారంభం కోసం ఎదురుచూడలేని పరిస్థితి తనకు ఎదురైనట్లు చెప్పాడు. తన నిర్మాణంలో ఏడు సినిమాలు సెట్స్ మీద ఉన్న సమయంలో కరోనా వచ్చిందని.. దీంతో ఈ సినిమాల్లో భాగమైన వ్యక్తులకు చెందిన వందల కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాడు.
ఒక దశలో తన దగ్గర నిధులు నిండుకొని వాళ్లకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలెత్తిందని.. అలాంటి పరిస్థితుల్లో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను అమెజాన్ వాళ్లకు అమ్మేయడం ద్వారా భారీ మొత్తంలో డబ్బులు రావడంతో ఈ కుటుంబాలను ఆదుకోగలిగానని చెప్పాడు. తన సినిమాను థియేటర్ కోసమే రెడీ చేసినప్పటికీ.. అనివార్య పరిస్థితుల వలన ఇలా ఆన్లైన్ లో రిలీజ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇలా రిలీజ్ చేయడం వలన మరింత మందికి రీచ్ అవుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.