బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ గతఏడాది ఏప్రిల్ ల్లోనే రిలీజ్ అయి అంచనాలను పెంచింది. మరో ఆరు నెలల్లో సినిమా వచ్చేస్తుందని ఆశ పడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. ఆరు నెలల తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలయింది. సరే.. ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతుందనుకుంటే.. అందుకు చిత్ర బృందం గ్యారంటీ ఇవ్వడంలేదు. ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని ఆరా తీయగా రెండు కారణాలు బయటికి వచ్చాయి. మొదటి ఏమిటంటే.. సాహో ని హాలీవుడ్ ప్రమాణాలతో తెరకెక్కించడం. ఈ విషయంలో సుజీత్ అసలు కాంప్రమైజ్ కావడం లేదు. రెండో కారణం ఏమిటంటే.. ప్రతి సన్నివేశాన్ని మూడు భాషల్లో చిత్రీకరించడం.
ఇదే ఎక్కువ సమయాన్ని తీసుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో డైలాగులు నేర్చుకొని ప్రతి ఒక్కరూ కరక్ట్ గా చెప్పడానికి ఎక్కువ టేక్స్ అవుతున్నాయి. సో ఈ కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందని సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 200 కోట్లతో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను హైదరాబాద్ లో తెరకెక్కిస్తున్నారు. తర్వాత చిత్ర బృందం దుబాయికి వెళ్లనుంది. అక్కడి శివార్లలోని కొండల్లో భారీ యాక్షన్ సీన్ చిత్రీకరించనున్నారు. ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్ లు పాల్గొననున్న ఈ యాక్షన్ సీన్స్ ను మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో షూట్ చేయనున్నారు.