రెజీనా కసాండ్రా.. ఇప్పుడంటే ఆమె సినిమాలు తగ్గాయి కానీ ఓ పదేళ్ల క్రితం వరుస సినిమాలతో బిజీగా ఉండేది. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు, దర్శకులు ఎదురుచూశారు. అయితే అంత బిజీగా ఉన్న ఆమెకు సినిమాలు తగ్గాయి. దీంతో ఏమైందా అని చాలామంది అనుకున్నారు. కొన్నాళ్లకు మళ్లీ సినిమాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా సెలెక్టడ్ సినిమా చేస్తోంది. ఆమె కెరీర్ ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
2015 టైమ్‌లో నటనకు దూరమవ్వాలని రెజీనా అనుకుందట. నటన మానేయాలని అప్పటివరకు ఓకే చేసిన సినిమాలను నటించేసి ఇక మానేయాలనుకుందట. (అయితే ఎందుకు మానేయాలి అనుకుంది అనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు.) కానీ ఆ తర్వాత నుంచి మళ్లీ అవకాశాలు వచ్చాయి. అయితే ఒకేతరహా పాత్రల్లో నటించకూడదని అనుకుని వచ్చిన ప్రతి అవకాశానికీ ఓకే చెప్పలేదు. ఎంపిక చేసిన పాత్రలతో కెరీర్‌ను నడిపించా అని రెజీనా చెప్పింది. అలాగే కెరీర్ ప్రారంభమైన తొలి రోజుల్ని కూడా గుర్తు చేసుకుంది.
టాలీవుడ్‌కి వచ్చిన తొలి రోజుల్లో ఉదయం 6కే డైలాగులు ఇచ్చేవారట. అప్పుడు తెలుగు రాక చాలా కష్టపడిందట. లైన్ టూ లైన్ నేర్చుకోవడం ప్రాక్టీస్ చేసిందట. ఆ శ్రమ కారణంగానే ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలను అని చెప్పింది రెజీనా. తొలి రోజుల్లో సినిమా చేసి ఇంటికి వచ్చేయడమే అని అనుకుందట. అయితే కాలం గడిచేకొద్దీ పీఆర్‌లు, సోషల్ మీడియా గురించి అర్థమైందట. దాంతో వాటికీ దూరంగా ఉందట. ఎందుకంటే నా నటనను చూసి అవకాశం ఇవ్వాలి కానీ, పబ్లిసిటీ చూసి కాదు అని ఆమె నమ్మడమే.
2005లో ‘కండ నాల్ ముదల్’ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రెజీనా. 2010లో ‘ఎస్.ఎమ్.ఎస్’ సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కన్నడ, హిందీలోనూ కనిపించింది. ఇప్పుడు చేతిలో ‘మూకుత్తి అమ్మన్ 2’, ‘సెక్షన్ 108’, ‘ఫ్లాష్‌బ్యాక్’ సినిమాలు ఉన్నాయి. అన్నట్లు ఈ మధ్య ‘ఢీ’ షోకి జడ్జిగా కూడా వచ్చింది.