సినిమా వాళ్లు సినిమాలో ఎలా కనిపిస్తారో, బయట కూడా అలానే ఉంటారు అని అనుకుంటుంటారు. అందులో కోపిష్టి అయితే బయట కూడా అలానే ఉంటారా? నటించే పాత్ర అతిజాగ్రత్తపరురాలు అయితే, నిజ జీవితంలో కూడా అలానే ఉంటారా? అనే డౌట్స్ ప్రేక్షకులకు ఉంటాయి. దీంతో అలాంటి ప్రశ్నలను సినిమా వాళ్లను మీడియా అడిగి.. సమాధానాలు తెలుసుకుంటూ ఉంటుంది. అచ్చంగా ఇలాంటి ప్రయత్నమే జరిగింది ‘శాకిని డాకిని’ ప్రెస్‌మీట్‌లో. రెజీనాను ఈ ప్రశ్న ఓ మీడియా ప్రతినిధి అడిగారు. దానికి ఆమెకు సర్రున కోపం వచ్చేసింది.
ఆ మీడియా పర్సన్‌తో కాస్త కటువుగానే మాట్లాడింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. ఈ సినిమా ప్రెస్‌మీట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ క్రమంలో ఓ విలేకరి ‘‘ఈ సినిమాలో మీ పాత్రకు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) ఉందనిపిస్తోంది. నిజ జీవితంలోనూ మీకు అలా ఓసీడీ ఉందా?’’ అని అడిగారు. దీంతో రెజీనా ఇబ్బందికి గురయ్యారు. ‘‘అందర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా?’’ కాస్త అసహనం ఫీలయ్యారు.
దాంతోపాటు ‘‘సినిమాలో మేము కేవలం నటిస్తున్నామంతే. పాత్ర డిమాండ్ చేయడం వల్లే అలా చేస్తాం. మీ దగ్గర ఇలాంటి ప్రశ్నలే ఉన్నాయా? అమ్మాయిల్ని చాలా గొప్పగా చూపిస్తూ ఈ సినిమా రూపొందించాం. అలాంటిది మీరిలా నా పాత్ర, ఓసీడీ గురించి అడుగుతున్నారేంటి?’’ అని కాస్త కటువుగానే అడిగింది రెజీనా. అయినా ‘‘వ్యక్తిగతంగా నేను శుభ్రతను ఇష్టపడే వ్యక్తిని. ఓసీడీ లాంటి సైకలాజికల్ డిజార్డర్ నాకేమీ లేదు’’ అంటూ ముగించింది రెజీనా.
ఆ తర్వాత ఆ విలేకరి.. ‘‘నేను అడిగిన ఉద్దేశం వేరు. కరోనా పరిస్థితుల తర్వాత అందరూ పరిశుభ్రతను ఎక్కువగా పాటిస్తున్నారు కదా. మీరూ అలానే చేస్తున్నారా?’అని వివరణ ఇచ్చారు. మరోవైపు ప్రెస్‌మీట్‌లో విలేకర్ల ఫోన్లు వరుసగా రింగ్ అవుతుండటంతో… రెజీనా కొంత అసహనానికి గురైంది. ‘‘ప్రెస్‌మీట్‌కి వచ్చేటప్పుడు ఫోన్లు సైలెంట్‌లో పెట్టుకోరా?’’ అని రెజీనా ప్రశ్నించింది. దీంతో అక్కడ కాసేపు నిశ్శబ్దం ఆవహించింది. విలేకరి ప్రశ్నకు ఆమెకు ఎంత చిరాకు వచ్చిందో.. కటువు సమాధానం మీడియా పర్సన్లకు అంతే కోపం తెప్పించింది అని చెప్పాలి.