భారత రాజకీయాల్లో ‘ఎమర్జెన్సీ’ (Emergency) అనేది మరపురాని విషయం. ఇందిరా గాంధీ హయాంలో వచ్చిన ఆ ఊహించని ముప్పు గురించి నాటి రాజకీయ నాయకులు, ప్రజలు ఎంతగానో చెబుతూ ఉంటారు. అంతలా ఇబ్బందులు పడిన క్షణం అది. ఎందుకు అలా చేశారు, చేశాక ఏమైంది అని చాలా ప్రశ్నలు ఇప్పటికీ వస్తుంటాయి. అయితే వీటి మీద క్లారిటీ ఇస్తా అంటూ ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఓ సినిమా చేశారు. అదే ‘ఎమర్జెన్సీ’.
Emergency
ఈ సినిమా ఇప్పటికే విడుదలై నానా రచ్చ జరగాల్సింది. అయితే సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఇదిగో, అదిగో అంటూ చెబుతున్నారు కానీ ఇంకా ఏమీ తేలలేదు. దీంతో సినిమా అసలు వస్తుందా లేదా అనే చర్చ కూడా జరిగింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత వివిధ పరిణామాల నేపథ్యంలో సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. అయితే ఇంకా సినిమా రిలీజ్ చేయలేదు. దీంతో ఏమైంది అనే చర్చ మళ్లీ మొదలైంది.
సినిమాకు రిలీజ్ డేట్ ఇస్తాం, మా సినిమాను జనాలకు చూపిస్తామని చెప్పిన బీజేపీ ఎంపీ కంగన రనౌత్ ఇంకా ఆ పని చేయలేదు. దీనికి కారణం బీజేపీ అదిష్ఠానం నుండి ఎలాంటి సమాచారం లేకపోవడమే అంటున్నారు. ప్రస్తుతం భారత్ – కెనడా దేశాల మధ్య సంబంధాల అంతగా బాగాలేదు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడాలో ఎక్కువగా నివసిస్తున్న సిక్కుల ఓట్ల కోసం ఆ దేశంలోని అధికార పార్టీ రాజకీయాలు చేస్తోంది. ఈ క్రమంలో రాజకీయాల కోసం భారత ప్రభుత్వాన్ని రెచ్చగొడుతోంది కూడా.
అలా మనకు తలనొప్పిగా మారిన ఖలిస్తానీ ఉద్యమానికి కెనడా పరోక్షంగా మద్దతిస్తోంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మన ప్రభుత్వం గట్టిగగా కౌంటర్ ఇస్తోంది. ఈ సమయంలో సిక్కులు – ఇందిరాగాంధీ హత్య అంశాలతో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను విడుదల చేస్తే చిక్కులు వస్తాయని బీజేపీ భావిస్తోందని టాక్. అందుకే కంగనకు సినిమాకు సంబంధించి క్లియరెన్స్ రాలేదు అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం అప్పులు చేశా అంటున్న ఆమెకు.. ఆ తిప్పలు ఇంకొన్నాళ్లు తప్పేలా లేవు. ఎప్పటివరకు అంటే కెనడాలో ఎన్నికలు అయ్యేంతవరకు.