ఒక సినిమాకి ప్రేక్షకుల అటెన్షన్ తెచ్చేది హీరో పేరు, హీరోయిన్ పేరు, దర్శకుడు పేరు మాత్రమే కాదు. సినిమా పేరు. అవును సినిమా పేరు కూడా అత్యంత కీలకం అనే చెప్పాలి. ఎంతటి క్రేజీ ప్రాజెక్టు అయినా జనాల్లోకి వెళ్ళాలి అంటే క్యాచీ టైటిల్ ఉండాలి. సినిమాకి టైటిల్ సరిగ్గా పెట్టకపోతే ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ‘ఖలేజా’ ‘గుంటూరు కారం’ వంటి సినిమాలను ఇందుకు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని సినిమాలు టైటిల్స్ వలన గట్టెక్కేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముచ్చట అలాంటిదే. 30 ఏళ్ళ క్రితం జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ‘ఆయనకి ఇద్దరు’ అనే సినిమా వచ్చింది. ఇలాంటి టైటిల్స్ పెట్టాలి అంటే అప్పటి స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ గారిని మించిన వారు లేరు అనే చెప్పాలి. అయితే జగపతి బాబుకి అప్పట్లో లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. అలాంటి టైంలో తమ అభిమాన హీరో సినిమాకి ‘ఆయనకి ఇద్దరు’ అనే టైటిల్ పెట్టడం వల్ల… జగపతి బాబు లేడీ ఫ్యాన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
మహిళా సంఘాలని ఆశ్రయించి దర్శకులు ఈవీవీ ఆఫీస్ ముందు రచ్చకి దిగారు. అయితే సినిమా పూర్తయిన తర్వాత ముందుగా మీకు చూపిస్తాను. అప్పటికీ మీకు టైటిల్ కరెక్ట్ కాదు అనుకుంటే.. నేను కచ్చితంగా టైటిల్ మార్చి రిలీజ్ చేస్తాను అని ఈవీవీ గారు వారికి సర్ది చెప్పి పంపించేశారు. ఒక దశలో ‘ఆయనకి ఇద్దరా?’ అనే టైటిల్ పెడదామని కూడా అనుకున్నారు. ఆ టైంలో జగపతి బాబు ‘తీర్పు’ ‘చిలకపచ్చ కాపురం’ ‘భలే బుల్లోడు’ ‘సంకల్పం’ వంటి డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్నారు.
అయితే టైటిల్ రచ్చ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది. టైటిల్ కూడా మార్మోగింది. సినిమా కంప్లీట్ అయ్యాక మహిళా సంఘాలకు చెందిన పెద్దలకి ముందుగా స్పెషల్ షో వేసి చూపించారు ఈవీవీ. తర్వాత వాళ్ళు ‘ఆయనకి ఇద్దరు’ యాప్ట్ టైటిల్ అని ఈవీవీతో ఏకీభవించారు. సినిమా బాగుందని కూడా వారు ప్రమోట్ చేయడం జరిగింది. అలా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. జగపతి బాబుని ప్లాపుల నుండి బయటపడేసింది.