ప్రముఖ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్ వారియర్ అనే విషయం తెలిసిందే. ప్రమాదకర క్యాన్సర్ నుండి ఆమె కోలుకున్నారు. ఆ క్యాన్సర్ గురించి ఆమె తరచూ చెబుతూనే ఉంటుంది. తద్వారా క్యాన్సర్‌తో పోరాడుతున్నవారికి ధైర్యం ఇచ్చినట్లు ఉంటుంది. అయితే ఈ క్రమంలో చేసిన వ్యాఖ్యలు ఇబ్బందిని తీసుకొచ్చాయి. దీనిపై ఆమె పెద్ద ఎత్తున విమర్శలు అందుకుంది. ఈ క్రమంలో తన కామెంట్స్‌పై స్పష్టతనిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
సోనాలీ బింద్రే 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడింది. దాని గురించి ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను క్యాన్సర్‌ను జయించడానికి ప్రకృతి వైద్యం ఎంతో సాయపడిందని చెప్పారు. అయితే ఆ వ్యాఖ్యలను కొంతమంది వైద్యులు తప్పుపట్టారు. ప్రకృతి వైద్యం క్యాన్సర్‌ను తగ్గిస్తుందని ఎక్కడా ఆధారాలు లేవని ఆమెపై విమర్శలు చేశారు. దీనిపై సోనాలి వివరణ ఇచ్చారు. తాను ఆ విషయాల్ని వైద్యురాలిగా చెప్పలేదని.. ఆ మహమ్మారి వల్ల తాను పడిన బాధను ప్రజలతో షేర్ చేసుకున్నాను అని చెప్పింది.
నేను మోసగత్తెని కాదు. నేను క్యాన్సర్‌తో నరకం అనుభవించినదాన్ని. దాని వల్ల కలిగే భయం, నొప్పి, బాధ తెలిసిన వ్యక్తిని. ఈ పోరాటంలో నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాల్నే పదేపదే చెబుతున్నాను. నేను చెప్పిన విషయాలను అందరూ అంగీకరించాలని, పాటించాలని చెప్పలేదు. ఇప్పుడు మరోసారి స్పష్టం చేస్తున్నాను. నేను నా ప్రయాణాన్ని నిజాయతిగా ప్రజలతో పంచుకున్నాను అని సోనాలి వివరణ ఇచ్చింది.
మన జీవిత ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదు. క్యాన్సర్‌తో పోరాడి దాని నుండి బయటపడినందుకు కృతజ్ఞతతో ఉన్నాను. ట్రీట్‌మెంట్ తీసుకున్న రోజులు నా జీవితంలో అత్యంత కష్టమైన దశ అని గతంలో క్యాన్సర్ గురించి సోనాలీ తెలిపారు. అప్పుడు ఆమె ధైర్యాన్ని పొగిడిన కొన్ని నోళ్లు ఇప్పుడు ఆమెను తెగ విమర్శిస్తున్నాయి. ఎందుకు, ఏంటి అనేది వారే చెప్పాలి. నేనిలా చేశాను అని ఈ ట్రోలింగ్ యుగంలో చెప్పడం తప్పైపోయింది.