రామ్ గోపాల్ వర్మ తన స్థాయి సినిమా తీసి ఏళ్ళు గడచిపోతుంది. వివాదమో, కాంట్రవర్సీనో పెట్టుబడిగా పెట్టి సినిమాలు తీయడం ఆయనకు అలవాటైపోయింది. ఐతే ఆయన గత చిత్రాలన్నీ ఘోరంగా నిరాశపరచినా ప్రతి కొత్త చిత్రంపై ప్రేక్షకులకు ఆసక్తి కలిగించడం అతని స్పెషాలిటీ. అలాంటి చిత్రమే క్లైమాక్స్. టీజర్స్, ట్రైలర్స్ తో భారీ అంచానాలు సినిమాపై కలిగేలా చేశారు వర్మ. క్లైమాక్స్ మూవీ ఎంత వరకు ఆ అంచనాలు చేరుకుందో సమీక్షలో చూద్దాం…
కథ: అమెరికాకు చెందిన ఓ యువ జంట ఆహ్లాదంగా గడపడానికి ఓ నిషిద్ధ ఎడారి ప్రాంతానికి వెళతారు. ఓ జాలి ట్రిప్ కి వెళ్లిన ఆ ఇద్దరు ప్రేమికులకు దిగ్బ్రాంతికర పరిస్థితులు ఎదురవుతాయి. వీరిపై ఓ డేంజరస్ గ్యాంగ్ అట్టాక్ చేస్తుంది. వారి బారినుండి బయటపడి పోలీసుల రక్షణ కోరిన ఆ జంటకు మరిన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆ జంటను ఇబ్బంది పెడుతున్న ఆ వ్యక్తులు ఎవరు? వారి బారి నుండి వారు ఎలా తప్పించుకున్నారు? వీరిద్దరూ సేఫ్ గా తిరిగి వారి ఇంటికి చేరారా? అనేది తెలియాలంటే క్లైమాక్స్ చూడాలి.
నటీనటుల పనితీరు: క్లైమాక్స్ లో కథ మొత్తం ఆర్జీవీ ఇద్దరు పాత్రలు మధ్య నడిపించారు. మియా మాల్కోవా మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ పాత్ర దారి మాత్రమే దాదాపు గంట నిడివి కలిగిన సస్పెన్సు క్రైమ్ డ్రామాలో కనిపిస్తారు. మియా మాల్కోవా పాత్ర మాత్రమే ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అవుతుంది.
మియా మాల్కోవా అందాల విందు ఓ స్థాయి వరకు బాగానే వడ్డించింది. ఆమె శృంగార సన్నివేశాలతో పాటు, హారర్ సన్నివేశాలలో కొంత మేరకు నటించి మెప్పించే బాధ్యత తీసుకుంది. మిగతా సినిమాలోని అంశాలతో పోల్చితే మియానే క్లైమాక్స్ లో ప్రేక్షకుడికి కొంచెం ఉపశమనం కలిగించే అంశం. కథలో ఎటువంటి ప్రాధాన్యం లేని మిగతా పాత్రలేవీ ప్రేక్షకుడికి గుర్తుండవు.
సాంకేతిక వర్గం పనితీరు: క్లైమాక్స్ లో సాంకేతిక అంశాలను ప్రస్తావించాలంటే ఒక్క కెమెరా వర్క్ గురించి మాత్రమే చెప్పుకోవాలి. మియా అందాలను చూపే క్రమంలో వాడిన కెమెరా యాంగిల్స్ కొత్తగా అనిపిస్తాయి. ఎడారి అందాలు మరియు కొన్ని సన్నివేశాలు బాగా ఆవిష్కరించారు.
బీజీఎమ్ అండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. సన్నివేశాలకు సింక్ లేకుండా కామన్ సాగే బీజీఎమ్ దెబ్బకి తల బొప్పికట్టాల్సిందే. విషయం లేని సినిమాను చాలా వరకు తగ్గించి ఎడిటర్ ప్రేక్షకులకు కొంచెం మేలు చేశాడు. నిర్మాణ విలువలు పూర్ గా ఉన్నాయి.
ఇక రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాలంటే ఓ చిన్న పాయింట్ ఆధారంగా చీఫ్ ప్రొడక్షన్స్ వాల్యూస్ తో మూవీ తీసి, దానికి భారీ హైప్ క్రీయేట్ చేసి సొమ్ము చేసుకోవడం పనిగా పెట్టుకున్నాడు అనిపిస్తుంది. ఆయన ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏమి చెప్పాలనుకున్నాడో ఆయనకే తెలియాలి.
విశ్లేషణ: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో చెత్త మూవీగా క్లైమాక్స్ మిగిలిపోతుంది. కథ, కథనాలు లేకుండా ఓ హారర్ అండ్ రొమాంటిక్ పాయింట్ ని తీసుకొని తనకు నచ్చినట్లు ఓ మూవీ తీసి ప్రేక్షకులపైకి వదిలారు. ట్రైలర్ చూసిన ప్రేక్షకుడు వర్మ చెప్పిన హారర్ లేకపోయినా మియా మాల్కోవా శృంగార సన్నివేశాలతో చంపేస్తుంది అనుకుంటే పొరపాటే. క్లైమాక్స్ లో హారర్ మాట అటుంచితే రొమాన్స్ యాంగిల్ కూడా మిస్సయింది.
ఒక ఫ్లో లేకుండా సాగే సినిమాలో సంబంధం లేకుండా సన్నివేశాలు, పాత్రలు వచ్చిపోతుంటాయి. ఈ జంటను అట్టాక్ చేసే గ్యాంగ్ మోటివ్ ఏమిటనేది ఎవరికీ అర్థం కాదు. ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేసి వర్మ ప్రేక్షకులకు మేలు చేశాడు. థియేటర్స్ లో అయితే సదరు థియేటర్స్ తెరలు, కుర్చీలు డామేజ్ అయ్యేవి అనడంలో సందేహం లేదు.
ఈ సినిమా చూసిన తరువాత వర్మ కెరీర్ క్లైమాక్స్ వచ్చిందని ప్రేక్షకుడు ఓ అంచనాకు వస్తాడు. వంద రూపాయలు అనవసర ఖర్చుగా భావిస్తాడు. కావున క్లైమాక్స్ జోలికి వెళ్లకపోతేనే బెటర్. వర్మ అభిమానులు, మియా మల్కోవా ఫ్యాన్స్ వంద ఇచ్చి ఓ లుక్ వేయవచ్చు.