సరైన కాంట్రవర్సి లేక కొన్ని రోజులుగా కామ్ గా ఉన్న వర్మకు మదిలో ఇప్పుడే ఓ బుద్దిపుట్టింది. వర్మ ఇటీవల హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో జరిగిన దిశా ఘటన ఆధారంగా సినిమా తీస్తాడట. ఆ సినిమా టైటిల్ కూడా దిశా అని వర్మ ప్రకటించడం జరిగింది. ఆ సంఘటనలో పాల్గొన్న నలుగురు నిందితులకు ఆ ఏహ్యమైన ఘటనకు పాల్పడటానికి వారిని పురిగొలిపిన పరిస్థితులు ఏమిటి..? దిశ పట్ల వారు సాగించిన చర్యలు ఎంత దారుణమో చూపిస్తాను అంటున్నాడు. అలాగే ఆ సంఘటన జరిగిన ప్రదేశాల ఫొటోలతో పాటు తాను తీయబోతున్న దిశా సినిమా గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు వర్మ.
ఎప్పుడూ ఇతరుల వ్యక్తిగత విషయాలను గెలికి వివాదంగా మలిచి సినిమాలు తీసే వర్మ…ఈ సారి తన సినిమా కొరకు ఓ సోషల్ బర్నింగ్ ఇష్యూని తీసుకున్నాడు. ఐనా వివాదం, కాంట్రవర్సీ లేకుండా వర్మ కేవలం సమాజ హితం కోసం సినిమా తీస్తాడు అంటే నమ్మలేము. మరి దిశా ఘటన ద్వారా ఎవరిని గెలికి వర్మ వార్తలలో నిలవనున్నాడో చూడాలి. వరుసగా వివాదాస్పద చిత్రాలు తీస్తున్న వర్మ తన సినిమాలపై ప్రేక్షకులలో ఆసక్తిని చంపివేశారు. ఆసక్తి రేపే వివాదాలు, వ్యక్తిగత విషయాలు ఆయన పాయింట్ గా తీసుకుంటున్నప్పటికీ అసలు ఏమాత్రం నిర్మాణ విలువలు, ఆసక్తికర అంశాలు లేకుండా సినిమా ఇష్టం వచ్చినట్టు తీస్తున్నాడు. దీనితో వర్మ సినిమాలు విడుదలకు ముందు సందడి చేసినా..విడుదల తరువాత రెండు రోజులు కూడా థియేటర్స్ లో ఆడటం లేదు.