అపర మేధావి అంటారో లేక తన మీద తనకి అపారమైన నమ్మకం గల వ్యక్తి అంటారో తెలియదు కానీ.. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ రెండు కేటగిరీలకు చెందిన వ్యక్తి అని అనుకోవడం తప్ప ఆయన్ని ఏ ఒక్క క్యాటగరీకి పరిమితం చేయలేం. అందుకే ఎంత గొప్ప మాటకారులైనా వర్మతో ఓపెన్ డిబేట్ లో కూర్చోవడానికి ధైర్యం చేయరు. అలాంటి రాంగోపాల్ వర్మ అప్పుడప్పుడు మీడియాతో తన సినిమాల గురించి ఇంటరాక్ట్ అవుతుంటాడు. అప్పుడు కూడా మీడియా కాబట్టి సైలెంట్ గా ఉంటాడా అంటే కాదు.. వాళ్ళకి కూడా పంచ్ లు వేస్తుంటాడు. నిన్న జరిగిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సెకండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అదే జరిగింది.
ఎప్పట్లానే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇష్టాగోష్టి పెట్టిన వర్మ.. అక్కడ మీడియావారు అడిగిన ప్రశ్నలకు వీలైనంత వెటకారంగా సమాధానాలు చెప్పడం మొదలెట్టాడు. కొందరికి వర్మ వెటకారం అర్ధమై సైలెంట్ అయిపోగా కొందరు మాత్రం అత్యుత్సాహంతో ప్రశ్నలు అడిగి లైవ్ లో పంచ్ లు వేయించుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి మీకు అన్నీ నిజాలు ఎలా తెలుసు అని వేసిన ప్రశ్నకు వర్మ.. నేను అప్పుడు ఆయన మంచం కింద ఉండి విన్నాను అని సమాధానం ఇవ్వడం హైలైట్ అయ్యింది. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్లలో విడుదలవుతుందా లేదా కనీసం సెన్సార్ అవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే.. వర్మ మాత్రం రోజుకో సంచలనాన్ని సృష్టిస్తున్నాడు. నిన్నటి ప్రెస్ మీట్ గురించి మాత్రం జనాలు ఇంకొన్ని రోజులు మాట్లాడుకొనేలా ఉంది.