కరోనా సెకండ్ వేవ్ వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, మందుల కొరత వల్ల ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొంతమంది సెలబ్రిటీలు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కొన్ని పనులు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. రెండు రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలోని కరోనా ఆస్పత్రులకు మందులను పంపించి వార్తల్లో నిలిచారు.
గతేడాది ఫస్ట్ వేవ్ సమయంలో కూడా మందులు, వైద్య పరికరాలను పంపించి గొప్పమనస్సు చాటుకున్న బాలకృష్ణ ఈ ఏడాది కూడా కూడా మందులను పంపించడం గమనార్హం. బాలకృష్ణ బాటలో హీరోయిన్ రోజా కూడా నడవటం గమనార్హం. రోజా తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరి నియోజకవర్గంలోని పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి 6 లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను అందించారు. రోజా తరపున ఆమె భర్త వైద్య పరికారాలను ఆస్పత్రి వైద్యులకు అందజేశారు.
ప్రజలు కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం తమ వంతు సహాయం చేస్తున్నామని సెల్వమణి తెలిపారు. రోజా చేసిన సాయం పట్ల నగరి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సర్జరీలు చేయించుకున్న రోజా ప్రస్తుతం ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంటినుంచే నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. బాలకృష్ణ, రోజా సాయం చేసిన విధంగా మరి కొందరు సెలబ్రిటీలు సాయం చేస్తే ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది.