‘ఆర్ఆర్ఆర్’ అంటే ఏంటి? ఏముంది రాజమౌళి, రామ్‌చరణ్, రామరావు చేస్తున్న సినిమా అని చెప్పేయొచ్చు. ఇంకా బాగా ఫాలో అయ్యేవాళ్లు అయితు ‘రణం రౌద్రం రుధిరం’ అని చెబుతారు. ఇంకా బాగా బాగా ఫాలో అయ్యేవాళ్లు అయితే ఆ సినిమాకు ఇంగ్లిష్‌లో ఏం పేరు పెట్టారు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ఏం పేరు పెట్టారో చెప్పేస్తారు. అయితే సినిమా లెక్కలు చూసేవాళ్లు మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ అంటే ‘రెమ్యూనరేషన్ రెమ్యూనరేషన్ రెమ్యూనరేషన్’ అని చెప్పొచ్చు.
ఎందుకంటే సినిమాకు అంత మొత్తంలో రెమ్యూనరేషన్‌లు అవుతున్నాయి. టాలీవుడ్‌లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే సినిమాకు భారీ మొత్తంలో బడ్జెట్ అయ్యింది. సుమారు రూ. 500 కోట్ల వరకు ఖర్చు పెట్టారని టాక్. ఇక రెమ్యూనరేషన్‌ల విషయం చూస్తే… రాజమౌళి కుటుంబమంతా కలసి ప్యాకేజీగా డబ్బులు తీసుకుంటారు. అంతేకాదు దాంతోపాటు లాభాల్లో వాటా కూడా ఉంటుంది అంటున్నారు. ఇక ఇద్దరు హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌కి చెరో రూ. 50 కోట్లు వరకు వచ్చుంటాయని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌కు రూ. 25 కోట్లు ఇచ్చారని భోగట్టా. కథానాయిక అలియా భట్ రూ. 8 కోట్ల నుండి – రూ. 10 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. శ్రియ, సముద్రఖని, ఒలీవియా మోరిస్‌కి కూడా మంచి మొత్తమే అందినట్లు సమాచారం. మిగిలిన నటులు, సాంకేతిక నిపుణులు కూడా మంచి మొత్తాన్నే అందుకున్నారని అంటున్నారు. ‘ఆర్‌ఆర్ఆర్’కి సుమారు రూ.500 కోట్లు బడ్జెట్ అయ్యిందని అంచనా వేస్తున్నారు.
నిజానికి రూ.400 కోట్ల నుండి రూ. 450 కోట్లలోపు సినిమాను ముగించాలని అనుకున్నారట. కానీ విడుదల ఆలస్యమయ్యేకొద్దీ వడ్డీలు పెరుగుతూ వచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్ల నుండి రూ. 550 కోట్లకు చేరిందంటున్నారు. ఆ లెక్కన సినిమాకు సుమారు రూ. 800 కోట్ల నుండి రూ. 850 కోట్ల వరకు రావాలి అని లెక్కలు వినిపిస్తున్నాయి.