ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కొత్త టికెట్ల జీవోను అమలులోకి తీసుకొనిరావడంతో ఏపీలో టికెట్ రేట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయనే సంగతి తెలిసిందే. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ ఏపీలో షూటింగ్ జరుపుకోకపోయినా ఈ రెండు సినిమాలను ప్రభుత్వం భారీ బడ్జెట్ సినిమాలుగా పరిగణించి టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం అయితే కల్పించింది. అయితే ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతులు ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే. ఇటీవల రాధేశ్యామ్ సినిమా బెనిఫిట్ షోను ప్రదర్శించిన థియేటర్ కు అధికారులు తాళం వేసిన సంగతి తెలిసిందే.
మంత్రి పేర్ని నాని సైతం ఆర్ఆర్ఆర్ కు రాజమౌళి వస్తే ఒక రేటు రాకపోతే ఒక రేటు ఉండదని స్పష్టం చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ రేట్లను ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లకు అదనంగా 100 రూపాయల మేరకు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందంటూ వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే అధికారికంగా ప్రభుత్వం నుంచి ఈ మేరకు ప్రకటన రాలేదు. సీఎం జగన్ నుంచి సానుకూలంగా స్పందన వచ్చిందని రాజమౌళి చెప్పారే తప్ప సీఎం జగన్ ఏయే విషయాలకు అంగీకరించారో చెప్పలేదు.
అయితే ఏపీ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ సినిమాను స్పెషల్ కేస్ గా పరిగణిస్తే మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతులు ఇస్తామని పేర్ని నాని అన్నారు. ఈ విధంగా ఈ సినిమాకు బెనిఫిట్ షోలకు అనుమతులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రేట్లకు 100 రూపాయల మేరకు పెంచడానికి అనుమతులు ఇస్తే ఇతర హీరోల అభిమానుల నుంచి విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల టికెట్ రేట్ల పెంపు ఉన్నా పరిమితంగా ఉంటుందని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తుందో లేదో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.