రెండూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే.. రెండింటిలోనూ కొత్త భామలే నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లు కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఆ మాత్రం దానికే రెండు కథలు ఒకటేనా? అని అనేస్తారా? అని మీరు అనొచ్చు. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే.. రెండు కథలూ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి అంటున్నారు. ఆ రెండు సినిమాలే ‘బేబీ’, ‘బుట్టబొమ్మ’. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ సినిమాల గురించే చర్చంతా. నిజంగానే ఈ రెండు సినిమాల కథలు ఒకటేనా? లేక కదా అనేది తెలియాలి.
సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘బేబీ’. ఈ సినిమాను దర్శకుడు మారుతి దగ్గరుండి చూసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు ప్రేమించడం, ఆ తర్వాత ఏమైంది అనేది కథ. ఆ ఇద్దరిలో ఒకడు మంచోడు కాగా, మరొకడు చెడ్డోడు. మరోవైపు ‘బుట్టబొమ్మ’ కథ కూడా దాదాపు ఇంతే. ఈ సినిమా మలయాళ మాతృక ‘కప్పెళ’ చూసినవారు ఎవరైనా ఈ విషయం చెప్పేస్తారు.
‘కప్పెళ’లో అప్పటివరకూ హీరోగా కనిపించినవాడు క్లైమాక్స్‌లో విలన్ అవుతాడు. ‘బేబీ’లో హీరో పాత్రను ఇంచుమించు ఇలాగే రాసుకున్నారు అని టాక్ వచ్చింది. దీంతో ఈ రెండు సినిమాల కథలు ఒకేటేనా అనే మాట వినిపిస్తోంది. ‘బుట్టబొమ్మ’ అంటే ‘కప్పెళ’కు అఫీషియల్ రీమేక్. కాబట్టి కాపీ ముద్ర పడదు. కానీ ‘బేబీ’ విషయంలో అలా కాదు. కొత్త కథ అని చెబుతున్నారు. దీంతో దీనికి ఫ్రీమేక్ అనే పేరు వచ్చేస్తుంది.
ఈ విషయం పక్కన పెడితే.. రెండు సినిఆల్లో ఏది ముందు వస్తుంది అనేదే ఇక్కడ లెక్క. ముందు వచ్చిన సినిమాకు వచ్చే ఫీల్, అప్లాజ్.. తర్వాత వచ్చేదానికి ఉండదు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ‘బేబీ’, ‘బుట్టబొమ్మ’ టీమ్స్ మేం ముందు అంటే మేం ముందు అనుకుంటున్నాయట. మరి రెండింటిలో ఏది మందు తీసుకొస్తారు అనేది చూడాలి. అప్పుడు కానీ రెండో సినిమా సంగతి తేలదు. అలాగే ఇలాంటి బాధ పడిన సినిమాల్లో ‘అంటే సుందరానికీ’, ‘కృష్ణ వ్రింద విహారి’ ఉన్నాయి.
‘అంటే సుందరానికీ’ సినిమాకు బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితం రాలేదు. ఈ మాటకు నాని ఒప్పుకోకపోవచ్చు అనుకోండి. మరి నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ ఏమవుతుందో చూడాలి. ఈ సినిమా కోసం శౌర్య ఏకంగా.. పాదయాత్రలే చేస్తున్నాడు. ఇదో రకం కొత్త ప్రచారం. చూద్దాం ఫలితం ఎలా వస్తుందో? 23న ‘కృష్ణ వ్రింద విహారి’ థియేటర్లలోకి వస్తాడుగా!