సాధారణంగా తెలుగు సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కుతుంటే వాటిని బాలీవుడ్ రేంజ్ అనో లేక హాలీవుడ్ రేంజ్ అనో పొగడడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. “బాహుబలి” తర్వాత “సాహో” సినిమాను కూడా అందరూ ఇండియన్ ఫిలిమ్ స్టాండర్డ్స్ ను పెంచుతుంది అని తెలుగు ప్రేక్షకులు మరియు ప్రభాస్ అభిమానులు కూడా సంతోషపడ్డారు. కానీ.. సాహో పోకడ చూస్తుంటే “అసలు ఇది తెలుగు సినిమాయేనా?” అని అనుమానపడేలా తయారవుతోంది. టీజర్ వరకూ పర్వాలేదు కానీ.. మొన్న విడుదలైన “సైకో సయ్యాన్”తోపాటు త్వరలో విడుదలకానున్న మరో పాట మరియు సినిమా మొత్తం బాలీవుడ్ తారాలతో నిండిపోవడంతో.. ఒకవేళ ఈ సినిమాను థియేటర్లో చూసినా కూడా ఏదో హిందీ సినిమాకి తెలుగు డబ్బింగ్ వెర్షన్ చూసిన ఫీల్ వస్తుందే కానీ.. తెలుగు సినిమా చూసిన ఫీల్ రాదేమో అని భయపడుతున్నారు.
హీరోయిన్ శ్రద్ధాకపూర్, విలన్స్ గా నటిస్తున్న జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, ఎవ్లీన్ శర్మా, మహేష్ మంజ్రేకర్ లు మొదలుకొని సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరవనున్న జాక్వలిన్ వరకూ అందరూ హిందీ వాళ్ళే. దాంతో “సాహో” హిందీ సినిమానా లేక తెలుగు సినిమానా అనే కన్ఫ్యూజన్ నెలకొనే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో దర్శకుడు సుజీత్ ఎలాంటి కేర్ తీసుకొంటాడో చూడాలి.