కమర్షియల్ సినిమాలతోపాటు కాన్సెప్ట్ సినిమాలు కూడా చేస్తూ నటుడిగా తన సత్తాను.. అభిరుచిని నిరూపించుకుంటూ వస్తున్న నటుడు ఆది పినిశెట్టి. “వైశాలి” ఫేమ్ అరివళగన్ దర్శకత్వంలో దాదాపు 14 ఏళ్ల తర్వాత కలిసి చేసిన “శబ్దం”. ఈ హారర్ ఎంటర్టైనర్ ట్రైలర్ మంచి ఆసక్తి నెలకొల్పింది. మరి సినిమాగా ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!
కథ: మున్నార్ లోని హోలీ ఏంజెల్స్ కాలేజ్ లో ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. దాంతో కాలేజ్ లో ఏదో దెయ్యం ఉందనే టాక్ గట్టిగా స్ప్రెడ్ అవుతుంది. ఆ కారణంగా కాలేజ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని, ఈ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేసేందుకు పారానార్మల్ ఇన్స్పెక్టర్ వ్యోమ వైద్యలింగం (ఆది పినిశెట్టి)ని ముంబై నుంచి పిలిపిస్తారు.
కాలేజ్ కి వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన వ్యోమాకి తెలిసిన విషయాలేమిటి? కాలేజ్ లో జరుగుతున్న వరుస ఆత్మహత్యల వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “శబ్దం” చిత్రం.
నటీనటుల పనితీరు: ఆది పినిశెట్టి వాయిస్ లో మంచి బేస్ ఉంటుంది. ఈ సినిమాలో అతడు పోషించిన వ్యోమ అనే పాత్రది ఆ బేస్ చాలా ప్లస్ అయ్యింది. అలాగే.. క్యారెక్టర్ గురించి బాగా రీసెర్చ్ చేసి, అర్థం చేసుకొని ఉండడం వల్ల, పారానార్మల్ ఇన్స్పెక్టర్ గా ఒదిగిపోయాడు.
సిమ్రాన్ కి మంచి క్యారెక్టర్ పడింది. ఆమె స్క్రీన్ స్పేస్ తక్కువే అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ ఉంది. సీనియర్ హీరోయిన్ లైలా ఈ చిత్రంలో ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. ఆమెను రెగ్యులర్ గా అమాయకపు హీరోయిన్ గా చూసి, ఈ సినిమాలో ఓ డిఫరెంట్ షెడ్ లో చూసేసరికి కొత్తగా అనిపించింది. ఆ క్యారెక్టర్ ను ఆమె క్యారీ చేసిన విధానం కూడా బాగుంది.
లక్ష్మీ మీనన్ నటిగా అలరించినప్పటికీ, ఆ క్యారెక్టర్ ను సరిగా వివరించలేదు. ఆమె పాత్రకు సంబంధించి చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు.
రెడిన్ కింగ్స్లే క్యారెక్టర్ అక్కడక్కడా కామెడీ పండించినప్పటికీ.. అతడితో పదే పదే “మింగించుకోవడం” అనే పదాన్ని పలికించి కాస్త చిరాకు పెట్టారు. కామెడీ పండించడానికి ఆ డబుల్ మీనింగ్ బూతు ఏమాత్రం అవసరం లేదు కూడా.
సాంకేతికవర్గం పనితీరు: తమన్ ఒక సంగీత దర్శకుడిగా కమర్షియల్ సినిమాలకంటే ఈ తరహా కాన్సెప్ట్ సినిమాలతోనే తన సత్తాను చాటుకుంటాడు. “శబ్దం”తో ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు. ఓపెనింగ్ క్రెడిట్స్ లో వచ్చే పాట సాహితీ చాగంటి వాయిస్ తో వెన్నులో చిన్నగా వణుకు పుట్టించింది. నేపథ్య సంగీతం విషయంలోనూ చాలా కేర్ తీసుకున్నాడు తమన్.
సింక్ సినిమా బృందం సౌండ్ డిజైన్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు బావున్నాయి. అయితే.. మిక్సింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఈ తరహా హారర్ సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ కంటే నిశ్శబ్దం చాలా ముఖ్యం. ఆ సైలెన్స్ ని ఇంకాస్త ఎక్స్ ప్లోర్ చేసి ఉంటే బాగుండేది.
అరుణ్ సినిమాటోగ్రఫీ వర్క్ విషయంలో చాలా రీసెర్చ్ చేసాడు. ముఖ్యంగా ఇన్ఫ్రా రెడ్ కెమెరాస్ & మోషన్ డిటెక్టర్స్ వంటి టెక్నాలజీని తెరపై చూపించిన విధానం బాగుంది. అయితే.. సరైన సీజీ వర్క్ తోడవ్వకపోవడంతో సినిమాటోగ్రఫీ వర్క్ పూర్తిస్థాయిలో ఎలివేట్ అవ్వలేదు.
ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ ను మెచ్చుకోవాలి. సెట్స్ లో ఐటమ్స్ అన్నీ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి.
దర్శకుడు అరివళగన్ హారర్ స్టోరీని కొత్తగా చూపించాలనుకున్నాడు. అందుకోసం సౌండ్ ను ప్రధానాంశంగా ఎంచుకున్నాడు. అలాగే.. దెయ్యం కాన్సెప్ట్ ను కామెడీతో కాకుండా ఎమోషనల్ గా డీల్ చేసిన విధానం బాగుంది. అయితే.. ఫస్టాఫ్ లో క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్ ను సెకండాఫ్ లో హోల్డ్ చేయడంలో తడబడ్డాడు. ఆ కారణంగా ఫస్టాఫ్ లో క్రియేట్ అయిన టెన్షన్ ను సెకండాఫ్ లో సస్టైన్ చేయలేకపోయాడు. అలాగే.. లాజికల్ గా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పలేదు.
ముఖ్యంగా లక్ష్మీ మీనన్ క్యారెక్టర్ కి ఎందుకని చనిపోయేవాళ్ళు ముందే కనిపిస్తున్నారు అనేదానికి సరైన లాజికల్ ఆన్సర్ ఇవ్వలేదు. అలాగే.. క్లైమాక్స్ ట్విస్ట్ ను మరీ కంగారుగా లాస్ట్ మినిట్ లో రివీల్ చేసారు. అందువల్ల మంచి కిక్ ఇవ్వాల్సిన లైలా పాత్ర ఓ రెగ్యులర్ రోల్ గా మిగిలిపోయింది. అయితే.. ఓవరాల్ గా దర్శకుడు అరివళగన్ తన మార్క్ ను చూపించుకున్నాడు కానీ సంతృప్తిపరిచే స్థాయిలో అలరించలేకపోయాడు.
విశ్లేషణ: హారర్ థ్రిల్లర్స్ కి సౌండ్ తోపాటు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే చాలా కీలకం. “శబ్దం”లో ఆ ట్విస్టులన్నీ వాటికవే సాల్వ్ అయిపోతూ ఉంటాయి. హీరోకి దెయ్యాలు కూడా కార్ ఇండికేటర్ లైట్స్ ఆన్ చేసి మరీ ఇటు వెళ్లాలో చెప్తూ ఉంటాయి. అందువల్ల థ్రిల్ ఫీలవ్వాల్సిన సీన్స్ కూడా సింపుల్ గా కనిపిస్తాయి. ఓవరాల్ గా “శబ్దం” పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయినా.. టెక్నికల్ గా పెట్టిన ఎఫర్ట్స్ తో అలరిస్తుంది. ఆది పినిశెట్టి నటన, సౌండ్ డిజైన్, సిమ్రాన్ & లైలా పాత్రలు “శబ్దం” చిత్రాన్ని ఓ మోస్తరుగా ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్ గా మార్చాయి.
ఫోకస్ పాయింట్: బేస్ సమపాళ్లలో సెట్ అవ్వని శబ్దం!
రేటింగ్: 2.5/5