బైకు ప్రమాదంలో గాయపడ్డ సాయిధరమ్ తేజ్ కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. గాయం తీవ్రత గురించి స్పష్టమైన సమాచారం లేకపోయినా.. చాలా ఇబ్బందులుపడి, ఎంతో మనోధైర్యంతో సాయితేజ్ కోలుకున్నాడని చెప్పొచ్చు. ఆ తర్వాత సాయితేజ్ ఎక్కడికైనా బయటకు వచ్చినా మునపటి ఉత్సాహంతో మాట్లాడలేకపోతున్నాడు. కాస్త ఇబ్బంది కూడా పడుతున్నాడు. ఈ క్రమంలో కొందరు తనను దారుణంగా అవహేళన చేశారని చెప్పుకొచ్చాడు. సాయితేజ్ నటించిన ‘విరూపాక్ష’ సినిమా త్వరలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.
అందులో భాగంగానే తన మాట గురించి, దాని విషయంలో పడ్డ ఇబ్బందుల గురించి వివరించాడు. ‘‘యాక్సిడెంట్ తర్వాత మాట విలువేంటో నాకు తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు షాక్‌కి గురయ్యాను. దాంతో మాట పడిపోయింది. జనాలకి ఆ విషయం తెలియదు కదా.. అందుకే వీడేంటి తాగేసి మాట్లాడుతున్నాడా?’’ అని జోకులేశారు అని చెప్పాడు సాయితేజ్. ‘‘నా మాట తిరిగి రావడం కోసం ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. సడెన్‌గా మాట పడిపోయినప్పుడు దాని వాల్యూ ఏంటో తెలిసింది.
మాట వచ్చే క్రమంలో నా (Sai Dharam Tej) పక్కనుండే వాళ్లు సపోర్ట్ మరవలేనిది. నేను మాట్లాడటానికి కష్టపడుతున్నానని తెలిసి చాలా ఓపికగా వినేవాళ్లు, ఎంతో సపోర్టు చేసేవాళ్లు. సినిమా షూటింగ్ సమయంలో సహనటులు కూడా హెల్ప్ చేశారు’’ అంటూ తన మాట కష్టాల గురించి వివరించాడు సాయితేజ్. ‘‘రిపబ్లిక్’ సినిమాలో నాలుగు పేజీల డైలాగ్‌ని అవలీలగా చెప్పేశాను. కానీ ఇప్పుడు హాఫ్ పేజీ డైలాగ్ చెప్పాలన్నా అంత ఈజీగా అవ్వలేదు.
ఒక్కోసారి ఎంత మాట్లాడదాం అన్నా.. మాట వచ్చేది కాదు. ఒక్కోసారి తడబడి ఇబ్బందిపడేవాణ్ని. ప్రకృతి నా లైఫ్‌ను నాకు వెనక్కి ఇచ్చింది అనుకుంటాను. ఏమీ లేని పోజిషన్ నుంచి వచ్చానుచ యాక్సిడెంట్‌తో నేను మళ్లీ రోడ్డు మీద పడ్డాను అనిపిస్తుంటుంది. దాదాపు రెండేళ్లపాటు ఇలాంటి పరిస్థితి చూశాను’’ అంటూ తన లైఫ్‌లో లోటైమ్ గురించి చెప్పారు సాయితేజ్.