అందరి హీరోయిన్స్ లో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న నటి సాయి పల్లవి (Sai Pallavi) . గ్లామర్ ప్రపంచంలో అమ్మడు ట్రెడిషినల్ తరహాలోనే తన స్టార్ ఇమేజ్ ను పెంచుకోవడం విశేషం. ఇక నటనలో తనదైన ముద్ర వేసుకుని, ప్రతి సినిమాలో పాత్రకు ప్రాణం పోసే విధంగా నటించే ఈ లేడీ సూపర్‌స్టార్, నిజజీవితంలోనూ ఎంతో సరదా మస్తీగా ఉంటుందట. ప్రస్తుతం ఆమె నటించిన తండేల్ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు, మరోసారి తన పెర్ఫార్మెన్స్‌కి ప్రశంసలు అందుకుంటోంది.
Sai Pallavi
అయితే స్టార్ హీరోయిన్‌గా మారే ముందు, చిన్నప్పటి నుండి ఆమెకు సినిమాలపై ఉన్న ప్రేమ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. చిన్నతనంలోనే డ్యాన్స్ అంటే విపరీతమైన ఆసక్తి ఉండేదట సాయి పల్లవికి. తల్లే డ్యాన్సర్ కావడంతో, చిన్నప్పటినుంచే స్టెప్పులేయడం అలవాటుగా మారిపోయిందట. అందుకే ఢీ4 షోలో తన డాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. నటనపై కూడా చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్నా, చదువును మధ్యలో వదలకుండా ఎంబీబీఎస్ పూర్తి చేసి తన మానసిక స్థైర్యాన్ని చూపించింది.
కానీ సినిమాలంటే తాను ఎంత పిచ్చి అభిమానినో, చదువుకునే రోజుల్లోనే, బుర్ఖా వేసుకుని థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేదట. కుటుంబ సభ్యులకు తెలియకుండా, తన హాస్టల్ ఫ్రెండ్స్‌తో కలసి, వీకెండ్ సినిమాలను ఎంజాయ్ చేసేదట. సాయి పల్లవి హీరో సూర్యకు (Suriya) డైహార్డ్ ఫ్యాన్. బాల్యంలో ఆయన అంటే ఫిదా అవుతుందట. “లైఫ్‌లో ఒక్కసారైనా సూర్య సార్‌తో నటించాలని కలగన్నా” అని ఆమె చెప్పింది. ఆ కోరిక ఎన్జీకే సినిమాతో తీరిందని చెప్పిన సాయి పల్లవి, ఆయనతో కలసి పనిచేయడాన్ని అద్భుత అనుభవంగా భావించింది.
ఇక తన ఫేవరిట్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ, శ్యామ్ సింగరాయ్ లో (Shyam Singha Roy) దేవదాసిగా నటించడం తనకు ప్రత్యేకమైన అనుభూతి కలిగించిందని చెప్పింది. ఆ పాత్ర కోసం వేసిన ఎర్రటి చీర, గాజులు, మేకప్ చూసి ఇప్పటికీ మరిచిపోలేనని అంటుంది. వైద్యవృత్తిని ఎంచుకున్నా, చివరికి నటనపై ఉన్న ఆసక్తి ఆమెను వెనక్కి తీసుకువచ్చింది. తండేల్ (Thandel) తర్వాత కూడా బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని,
అయితే తన చిరకాల కోరిక అయిన పౌరాణిక చిత్రాల్లో నటించాలని ఆశపడుతున్నట్లు సాయి పల్లవి తెలిపింది. రామాయణ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ఇదే అని ఆమె చెప్పడం ఆసక్తికరం. ఫిట్‌నెస్ విషయంలో జిమ్‌కు పెద్దగా వెళ్లని సాయి పల్లవి, రోజుకు బ్యాడ్మింటన్ ఆడడం, ఖాళీ సమయాల్లో డ్యాన్స్ చేయడం ద్వారా ఫిట్‌గా ఉంటుందట.