అజిత్ కుమార్ (Ajith Kumar) , త్రిష (Trisha), అర్జున్ సర్జా (Arjun Sarja) కాంబినేషన్ లో సూపర్ హిట్ “గ్యాంబ్లర్” తర్వాత వచ్చిన సినిమా “విడాముయార్చి”. “తడం, కలగ తలైవన్” చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ సంపాదించుకున్న మగిళ్ తిరుమేని (Magizh Thirumeni) ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. లైకా సంస్థ నిర్మించింది. ఈ చిత్రాన్ని తెలుగులో “పట్టుదల” (Pattudala) అనే టైటిల్ తో అనువదించి.. విడుదల చేశారు. కనీస స్థాయి ప్రమోషన్స్ లేకుండా తెలుగులో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!
Pattudala Review
కథ: 12 ఏళ్ల వివాహ బంధం అనంతరం అర్జున్ (అజిత్) నుండి వేరుపడడం కోసం విడాకులు తీసుకొని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవాలనుకుంటుంది కయల్ (త్రిష). ఒక చివరి ట్రిప్ గా టిబ్లిస్ బయలుదేరతారు. 9 గంటల జర్నీలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా ఉండని ప్రాంతంలో చిక్కుకుంటారు.
అక్కడ అనుకోకుండా పరిచయమైన రక్షిత్ (అర్జున్ సర్జా) & దీపిక (రెజీనా) (Regina Cassandra) వల్ల అర్జున్ జీవితంలో ఊహించని మలుపులు ఎదురవుతాయి. అసలు రక్షిత్ & దీపిక ఎవరు? అర్జున్ జీవితంలోకి ఎందుకొచ్చారు? ఈ నలుగురి మధ్య జరిగిన డ్రామా ఏంటి? దాని కారణంగా అర్జున్ ఎలా ఎఫెక్ట్ అయ్యాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “పట్టుదల” (Pattudala) చిత్రం.
నటీనటుల పనితీరు: రియాలిటీకి దగ్గరగా ఉండే హీరో పాత్రలో అజిత్ కుమార్ ను చూడడం కాస్త కొత్తగా అనిపించింది. పోరాట సన్నివేశాలు కూడా చాలా ఆర్గానిక్ గా ఉన్నాయి. అన్నిటికీ మించి అనవసరంగా చంపుకోడాలు లేవు. ఆ కారణంగా సినిమాలో అనవసరమైన హీరోయిక్ ఎలివేషన్స్ కాకుండా.. భార్యను కాపాడాలనుకునే భర్త పాత్ర చక్కగా ఎలివేట్ అయ్యింది. అయితే.. అజిత్ పర్సనాలిటీలో చోటుచేసుకున్న భారీ మార్పుల కారణంగా చాలా చోట్ల కంటిన్యూటీ మిస్ అయ్యింది. దాని వల్ల చిన్నపాటి కన్ఫ్యూజన్ కూడా తలెత్తింది.
త్రిష వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తోంది. సినిమాలో ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేకపోయినప్పటికీ.. అజిత్ పక్కన అందంగా కనిపించింది. అర్జున్ సర్జా & రెజీనా కసాండ్రా సైకో విలన్స్ గా జీవించడానికి ప్రయత్నించారు. అయితే.. వారి పాత్రల తాలూకు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ సరిగా లేని కారణంగా వాళ్లు ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ల గోల్ ఏంటి? అనేదానికి సరైన క్లారిటీ లేకుండాపోయింది. మరో కీలకపాత్రలో ఆరవ్ మెప్పించాడు. అతని స్క్రీన్ ప్రెజన్స్ బాగుంటుంది.
సాంకేతికవర్గం పనితీరు: ప్రతి సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచే అనిరుధ్.. :పట్టుదల” విషయంలో మాత్రం ఎందుకో హ్యాండ్ ఇచ్చాడు. నేపథ్య సంగీతం కానీ, పాటలు కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ లిరిక్స్ కానీ సౌండ్ మిక్సింగ్ కానీ సరిగా లేకపోవడం అనేది సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది. ఓం ప్రకాష్ (Om Prakash) సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. అజర్ బైజాన్ నేచురల్ లొకేషన్స్ ని చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ & హమ్మర్ కార్ లో ఫైట్ సీన్ చాలా నేచురల్ గా ఉంది. మంచి థ్రిల్ కలిగిస్తుంది కూడా.
దర్శకుడు మగిళ్ హీరోయిజాన్ని సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు. ముఖ్యంగా అనవసరమైన హింసను ఎవాయిడ్ చేసి మంచి పని చేశాడు. ఒక దర్శకుడిగా అతని టేకింగ్ విషయంలో ఎలాంటి నెగిటివిటీ లేదు. అయితే.. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ సరిగా లేకపోవడం, అజిత్ & త్రిష నడుము బాండింగ్ ను సరిగా ఎలివేట్ అవ్వలేదు. అలాగే.. వాళ్లు ఎందుకు విడిపోవాలి అనుకుంటున్నారు అనేందుకు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. వీటి కారణంగా సినిమాతో కానీ క్యారెక్టర్ తో కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేక ఇబ్బందిపడ్డారు. దాంతో.. యాక్షన్ సీన్స్ & సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉన్నప్పటికీ.. సినిమాతో ట్రావెల్ అవ్వలేకపోయారు. ఆ కారణంగా దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్న మగిళ్.. కథకుడిగా మాత్రం మెప్పించలేకపోయాడు.
విశ్లేషణ: తెలుగు డబ్బింగ్ వెర్షన్ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, అసలు సినిమా విడుదలవుతున్నట్లు బేసిక్ బజ్ లేకపోవడం, సరైన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కొరవడడం కారణంగా “పట్టుదల” ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. ముఖ్యంగా మొదటి 20 నిమిషాలు, సెకండాఫ్ ప్రొసీడింగ్స్ లో ల్యాగ్ కారణంగా 154 నిమిషాల సినిమా.. 180 నిమిషాల్లు సాగిన భావన కలిగించింది. సో, తెలుగు రాష్ట్రాల్లో “పట్టుదల” పట్టు సాధించడం అనేది కష్టమే!