‘హిట్’… టాలీవుడ్‌లో ఈ సిరీస్ సినిమాలకు మంచి ఆదరణ దొరికింది. ఈ సిరీస్‌లో రెండు సినిమాలు వచ్చి బాక్సాఫీసు దగ్గర అదిరిపోయే విజయాలు అందుకున్నాయి. దీంతో మూడో సినిమా ఎప్పుడు వస్తుంది అనే చర్చ మొదలైంది. దీనికి మరో కారణం ‘హిట్ 3’ కాస్టింగ్. ఆ సినిమాలో హీరోగా నాని నటిస్తాడని ‘హిట్ 2’ క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చేశారు కూడా. అర్జున్ సర్కార్ అనే వైల్డ్ పోలీసు ఆఫీసర్‌గా నాని మూడో ‘హిట్ 3’లో కనిపించాల్సి ఉంది.
అయితే, ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే… ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఎందుకంటే ‘హిట్ 2’ వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటివరకు ‘హిట్ 3’కి సంబంధించి ఎలాంటి హింట్ లేదు. ‘హిట్ 2’ ఆఖరులో ఇచ్చిన సమాచారం తప్ప ఇంకేమీ లేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు, నానిని అర్జున్ సర్కార్‌గా చూసేదెప్పుడు అనే ప్రశ్నలు అభిమానుల నుండి వినిపిస్తున్నాయి. అయితే దీనికి తాజాగా దర్శకుడు శైలేష్ కొలను నుండి సమాధానం వచ్చేసింది.
విక్టరీ వెంకటేశ్ 75వ సినిమా అయిన ‘సైంధవ్’కు శైలేష్ కొలనునే దర్శకుడు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హిట్ 3’ గురించి కూడా చెప్పారు. మామూలుగా ఓ హిట్ కాన్సెప్ట్, సిరీస్‌లో వరుసగా సినిమాలు చేసి మంచి విజయాలు అందుకోవాలని చూస్తారు. కానీ ‘హిట్ 3’ సినిమా విషయంలో అలా ఆలోచించడం లేదంటున్నారు దర్శకుడు శైలేష్ కొలను. అంతేకాదు దాని వెనుక ఆయనకున్న లాజిక్ కూడా చెప్పారు.
‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం ఏడు కథలు ఉన్నాయని, వాటిని ఏడుగురు హీరోలు చేయాలని చెప్పిన శైలేష్.. ఏటా ఒక సినిమా చేసుకుంటూ వెళ్తే కొన్నాళ్లకు ప్రేక్షకులు లైట్ తీసుకుంటారు అని లాజిక్ చెబుతున్నారు. ‘హిట్ 1’ సినిమా హిట్టయిందని వెంటనే ‘హిట్ 2’ చేశాం. అది కూడా విజయం సాధించిందని ‘హిట్ 3’ తీసేస్తే ‘హిట్ 4’ వచ్చేసరికి అంత ఆసక్తి ఉండకపోవచ్చు. అందుకే మూడో ‘హిట్’ కోసం కావాలనే గ్యాప్ ఇస్తున్నాం అని చెప్పారు.
ఆ సినిమా కోసం కాస్త గ్యాప్ ఇస్తే జనంలో ఇంకాస్త క్రేజ్ వస్తుందనేది దర్శకుడి ఉద్దేశం అని అర్థమవుతోంది. అలా అని ఆ సినిమాను పూర్తిగా వదలేయలేదట. ఆ సినిమాకు సంబధించి ఏవైనా ఆలోచనలు రాగానే వెంటనే నోట్ చేసుకుంటున్నారట.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!