మనుషుల్ని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని పెద్దలు చెప్పేవారు. అప్పుడు అవునా.. నిజమా అనుకునేవాళ్లం. ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్లకు ఈ విషయాన్ని ఆపాదిస్తే… మీ సోషల్ మీడియా అకౌంట్లను పోలిన అకౌంట్లను ఏడేం ఖర్మ… ఇంకా చాలానే ఉంటాయి అనొచ్చు. ఫేస్‌బుక్‌లో డూప్లికేట్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి డబ్బులు అడుగుతున్నారు. బుట్టలో పడినవారి దగ్గరి నుండి డబ్బులు లాగేస్తున్నారు. ఇది కొత్త మోసం. అయితే పాత మోసాలు అలానే ఉన్నాయి. మెసేజ్, వాట్సాప్‌ల ద్వారా డబ్బులు అడగడం.
ప్రాసెస్ అంతా సేమ్ ఫేస్‌బుక్ ప్లేస్‌లోకి వాట్సాప్ వస్తుంది అంతే. ఇప్పుడు ఈ ఇబ్బంది పడుతున్నది సాయితేజ్. సాయితేజ్‌తో కలసి నటించిన కొంతమందికి, సాయితేజ్‌కు తెలిసినవారికి గత కొన్ని రోజులుగా ఓ వాట్సాప్ నెంబరు నుండి మెసేజ్‌లు వస్తున్నాయట. ‘సార్ డబ్బులు అడిగారు’ అనేది ఆ మెసేజ్‌ల సారాంశం. అలా తన పేరుతో డబ్బులు అడుగుతున్న విషయం సాయితేజ్ దృష్టికి వచ్చింది. దీంతో ఆ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో స్పందించాడు సాయితేజ్. అలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని కోరాడు. దాంతోపాటు వాట్సాప్ ఛాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నాడు.
‘‘గుర్తుతెలియని వ్యక్తి నా పేరు ఉపయోగించుకుని, కొంతమంది నాకు తెలిసినవారి దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆ వ్యక్తిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి అందరూ అప్రమత్తంగా వ్యవహరించండి. నాపేరుతో వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దు’’ అని సాయితేజ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నాడు. అయితే ఆ మెసేజ్‌లు పెడుతోంది ఎవరు అనేది చెప్పలేదు. స్క్రీన్ షాట్‌లో కూడా పేరు కనిపించకుండా చూసుకున్నాడు.