కొంతమంది హీరోయిన్లు చాలా ఫిట్‌గా ఉంటారు. ఎంతలా ఫిట్ అంటే వీళ్లు స్పోర్ట్స్‌లోకి వస్తే పతకాలు గ్యారెంటీ అనేంతలా కనిపిస్తారు. అలాంటి వారిలో ప్రముఖ నాయిక సయామీ ఖేర్ ఒకరు. ఇటీవల ‘జాట్’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన సయామీ.. ఇప్పుడు మరో రంగమైన క్రీడల్లో మోడల్ అందుకుంది. విదేశాల్లో నిర్వహించే ట్రయథ్లాన్ పోటీల్లో పాల్గొని పతకం గెలుచుకుంది.
ఏడాది వ్యవధిలో రెండు సార్లు ‘ఐరన్‌మ్యాన్ 70.3’ పోటీ పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డు సాధించింది. 2024 సెప్టెంబరులో ‘ఐరన్ మ్యాన్ 70.3’ పోటీలో తొలి మెడల్‌ని అందుకున్న సయామీ ఖేర్.. ఇప్పుడు స్వీడన్‌లో నిర్వహించిన రేస్‌లో గెలిచి మరో పతకం అందుకుంది. 1.9 కిలో మీటర్ల ఈత, 90 కిలో మీటర్ల సైక్లింగ్, 21.1 కిలో మీటర్ల పరుగు ఈ ట్రయథ్లాన్‌లో ఉంటాయి. అత్యంత కష్టమైన పోటీల్లో ఇదొకటి అని చెబుతారు.
ఎంతో క్రమశిక్షణ, ఫిట్‌నెస్ ఉంటేనే ఇలాంటి పోటీల్లో విజయం దక్కుతుంది. ఇక గతేడాది రేస్ కంటే ఈ ఏడాది రేస్‌ను సయామీ 32 నిమిషాల కంటే ముందే పూర్తి చేయడ గమనార్హం. అన్నట్లు ఈ పోటీల కోసం ఆమె గత కొన్నేళ్లుగా శిక్షణ కూడా తీసుకుంది. ఇక సయామీ సినిమాల సంగతి చూస్తే.. పైన చెప్పినట్లు ఈ ఏడాద ‘జాట్’ సినిమాతో వచ్చింది.
త్వరలో ‘స్పెషల్ ఓపీఎస్ 2’ వెబ్‌సిరీస్ రాబోతోంది. ఇక తెలుగు సంగతి చూస్తే సాయి తేజ్‌తో ‘రేయ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జున ‘వైల్డ్‌డాగ్’, ఆనంద్ దేవరకొండ ‘హైవే’ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో మళ్లీ నటించలేదు. హిందీలో అయితే వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. మధ్యలో మరాఠీ సినిమా కూడా చేసింది. వెబ్ సిరీస్‌ల్లో అయితే ‘స్పెషల్ ఓపీఎస్’, ‘బ్రీథ్: ఇన్ టు ది షాడోస్’, ‘ఫాడు’ లాంటివి చేసింది.