మయోసైటిస్ రుగ్మత తర్వాత సమంత లైఫ్ స్టైల్ చాలా వరకు మారిపోయింది. అంతకుముందు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినా.. ఇప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటోంది. ఈ క్రమంలో ఆరోగ్యం గురించి అందరికీ చెప్పే ప్రయత్నమూ చేస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఆమె మొబైల్ ఫోన్ వినియోగం, వ్యసనంగా మారడం గురించి మాట్లాడింది. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌గా మారాయి.
మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాల గురించి ‘టేక్ 20 హెల్త్’ ద్వారా అవగాహన కల్పిస్తోంది సమంత. ఆయా రంగాలకు చెందిన నిపుణులను ఇంటర్వ్యూ చేస్తుంటుంది. వారు చెప్పిన విషయాలు అందరికీ తెలియజేస్తుంది. ఈ క్రమంలో తన జీవితంలో జరిగిన విషయాలను కూడా చెబుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ‘బయో హ్యాకింగ్’పై జరిగిన చిన్న ముఖాముఖిలో మాట్లాడుతూ తన మొబైల్ అడిక్షన్ గురించి చెప్పింది.
ఒకానొక సమయంలో మొబైల్‌కు తాను బాగా అడిక్ట్ అయ్యానని, ఫోన్ లేకుండా తాను ఉండలేకపోయేదానినని చెప్పింది. ఫోన్ విషయంలో తొలుత తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయేదానినని, అంతలా ఫోన్ వాడకానికి బాగా అలవాటు పడ్డానని తెలిపింది. అసలు అదొక టాక్సిక్ రిలేషన్‌షిప్‌లా అనిపించింది అని కూడా చెప్పింది. అంతేకాదు దానిని ఎలా అధిగమించింది అనేది కూడా తెలిపింది.
మొబైల్ అలవాటు నుండి బయటపడటానికి డిజిటల్ డిటాక్స్ ఫాలో అయ్యాను. ఎవరితోనూ మాట్లాడకుండా, ఫోన్ చూడకుండా, ఎవరినీ కలవకుండా మూడు రోజులపాటు ఉండాలని నిర్ణయించుకున్నా. అలా కొన్నిరోజులపాటు పాటించిన తర్వాత ఎంతో మారా అని సమంత చెప్పుకొచ్చింది. ఇప్పుడు చాలా వరకు ఈ ఇబ్బందికి దూరంగా ఉన్నా అని కూడా చెప్పింది.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘శుభమ్’ సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసింది. అయితే ఆశించిన ఫలితం రాలేదు. నటిగా ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇది కాకుండా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అందులో నటి, నిర్మాత సమంతనే.