‘ఆది’ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ‘సింహాద్రి’ నిర్మాతలు అయిన వి.ఎం.సి(విజయ మారుతి క్రియేషన్స్) వారితో ఎన్టీఆర్ ఒక సినిమా మొదలుపెట్టాడట. 2 సినిమాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. వి.ఎం.సి వారితో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఓ లవ్ స్టోరీ.అప్పట్లో కొంచెం క్రేజ్ ఉన్న పెద్ద డైరెక్టర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. 50 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరోపక్క ‘ఆది’ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ అయిపోయింది.
మొదట ఆ సినిమాపై ఎవ్వరికీ అంచనాలు లేవు. ఎన్టీఆర్ ఒకే ఫార్మాట్లో వెళ్తున్నాడేమో అనే కామెంట్స్ వినిపించాయి. ఎందుకంటే ‘స్టూడెంట్ నెంబర్ 1’ హిట్ అయ్యింది అని వరుసగా స్టూడెంట్ బ్యాక్ డ్రాప్లోనే సినిమాలు చేస్తున్నాడు అని అప్పట్లో కొందరు అభిప్రాయపడ్డారు. కానీ ‘ఆది’ రిలీజ్ అయ్యి ఆ అంచనాలను తలకిందులు చేసింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ ఊర మాస్ అవతార్ చూసి అంతా షాక్ అయ్యారు.
దీంతో ‘సింహాద్రి’ నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. ఎన్టీఆర్ ని అంత పీక్ లో చూసిన తర్వాత..తమ సినిమాలో లవర్ బాయ్ చూడరు అని వాళ్ళు పసిగట్టేశారు. దీంతో అప్పటివరకు జరిగిన షూటింగ్ ను పక్కన పెట్టేసి…. ఓ మాస్ కథ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో దొరస్వామి రాజు, విజయ్ కుమార్ వర్మ ఒకరోజు విజయేంద్ర ప్రసాద్ గారిని కలిశారు.దొరస్వామి రాజు నిర్మించిన ‘ప్రెసిడెంటుగారి పెళ్ళాం’ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ రైటింగ్ టీంలో పని చేశారు.
ఆ రిలేషన్ తో వెళ్లి ‘నా కొడుకు(రాజమౌళి) వద్ద ఓ కథ ఉంది.. ఒకసారి వింటారా?’ అని అడిగారు. వెంటనే రాజమౌళిని పిలిపించి కథ చెప్పించారు. ఎలాగు ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన అనుబంధం ఉంది కాబట్టి.. అతను కూడా ఓకే చెప్పేశాడు. అలా ఆ కథ సెట్స్ పైకి వెళ్ళడం ‘సింహాద్రి’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించడం జరిగిపోయాయి. నేటితో ‘సింహాద్రి’ రిలీజ్ అయ్యి 22 ఏళ్ళు పూర్తి కావస్తోంది.