మొన్నామధ్య శ్రీలీల (Sreeleela) గురించి మాట్లాడుతూ… అన్నీ ఒకే రకం పాత్రలు చేస్తూ వెళ్తోంది అనుకున్నాం గుర్తుందా? ‘ఆదికేశవ’ (Aadikeshava) , ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) సినిమాల సమయంలో ఈ చర్చ వచ్చింది. పెద్ద కంపెనీకి ఎండీ / ఓనర్ స్థాయిలో ఉండి తన దగ్గరకు వచ్చిన ఉద్యోగికో, లేదంటే ఏదో విషయంలో హెల్ప్ చేసిన ఉద్యోగితోనో ప్రేమలో పడే పాత్రలు చేస్తోంది అనుకున్నాం. ఇప్పుడు ఇదే తరహాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పాత్రల ఎంపిక గురించి కూడా చర్చ నడుస్తోంది.
కావాలంటే మీరే చూడండి… తెలుగులో ఆమె చేసిన మూడు సినిమాల్లో ఆమె పాత్ర చిత్రణ దాదాపు ఒకేలా ఉంటుంది. లేదంటే లైన్ కామన్‌గా ఉంటుంది. తెలుగులో ఆమె తొలి సినిమా ‘సీతా రామం’లో (Sita Ramam) ధనవంతురాలు అయిన ఆమె… తనను ఓ సందర్భంలో కాపాడిన సైనికుడి కోసం సగటు మహిళగా మారిపోతుంది. ఆ తర్వాత చేసిన ‘హాయ్ నాన్న’ (Hi Nanna) సినిమాలో కూడా ఇలాంటి పాత్రే. ధనవంతురాలైన మహిళ ఓ పెళ్లైన మగాడిని ప్రేమించి అతనినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది.
ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’లో (Family Star) వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న కుటుంబం నుండి మధ్యతరగతి కుటుంబానికి పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయిలా కనిపించింది. దీంతో మృణాల్ అంటే ఇలాంటి పాత్రలేనా అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగే ప్రమాదం ఉంది. ఇలా చేస్తే మాస్ ప్రేక్షకులకు ఆమె దూరమయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఎందుకంటే ఈ క్లాస్ లుక్, క్యారెక్టర్ వారికి అంతగా ఆనకపోవచ్చు. మరి ఈ విషయంలో మృణాల్ ఎలాంటి ఆలోచన చేస్తుందో చూడాలి.
అయితే, ప్రస్తుతం మృణాల్ చేతుల్లో ఎలాంటి సినిమాలు లేవు. చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాలో ఆమె నటిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి కానీ ఎలాంటి పక్కా సమాచారం లేదు. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. ఇది కాకుండా ఆమె రెండు తమిళ సినిమాలు ఓకే చేసిందని టాక్. మరి అవి ఎలాంటి కథలో, పాత్రలో చూడాలి. అప్పుడే ఆమె ఆలోచన మారిందో లేదో తెలుస్తుంది.