కోవిడ్ తర్వాత సినీ పరిశ్రమలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నటీనటుల పారితోషికాల విషయాల్లో కావచ్చు, ప్రొడక్షన్ ఖర్చుల విషయాల్లో కావచ్చు, బిజినెస్ విషయాల్లో(ఓటీటీ, థియేట్రికల్, శాటిలైట్) కావచ్చు.. ఇలా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులు సినిమా చూసే పద్ధతి మారిపోయింది. ఏ సినిమాని థియేటర్ కి వెళ్లి చూడాలో.. ఏ సినిమాని ఓటీటీలో చూడాలో అనేది వాళ్ళు ఇంట్లో ఉండి ఫోన్లు చూసుకుంటూ డిసైడ్ చేసుకుంటున్నారు.
పెద్ద హీరోల సినిమాలు అయినా సరే థియేటర్ కి వెళ్లి చూడాలా? వద్దా? అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత వచ్చిన స్టార్ హీరోల సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ అవ్వలేదు అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఒక్క స్టార్ హీరో సినిమా కూడా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు.
ప్రభాస్ (Prabhas) నుండి కోవిడ్ తర్వాత వచ్చిన ‘రాధేశ్యామ్’ ‘ఆదిపురుష్’ చిత్రాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. ‘సలార్’ కి హిట్ టాక్ వచ్చినా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు.
మహేష్ బాబు నుండి కోవిడ్ తర్వాత ‘సర్కారు వారి పాట’ ‘గుంటూరు కారం’ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కి దగ్గర వరకు వెళ్లి ఆగిపోయాయి.
పవన్ కళ్యాణ్ నుండి కోవిడ్ తర్వాత వచ్చిన ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ సినిమాలు యావరేజ్ ఫలితాలతో సరిపెట్టుకున్నాయి. ఇక ‘బ్రో’ అయితే ఎక్కువ నష్టాలు మిగిల్చింది.
అల్లు అర్జున్ నుండి కోవిడ్ తర్వాత వచ్చిన ‘పుష్ప’ కూడా తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ ఫలితాన్నే అందుకుంది. కానీ మిగిలిన భాషల్లో సక్సెస్ అందుకోవడం జరిగింది.
ఇక ఎన్టీఆర్ – రాంచరణ్..లు కలిసి నటించిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కూడా కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలు మిగిల్చింది.
చిరంజీవితో కలిసి చరణ్ నటించిన ‘ఆచార్య’ అయితే పెద్ద డిజాస్టర్ గా మిగిల్చింది.
మొత్తంగా స్టార్ హీరోల సినిమాలు క్లీన్ హిట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్.. టికెట్ రేట్లు భయంకరంగా పెంచేయడం వల్లే అని చెప్పాలి. అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావడం తగ్గించేశారు.. అభిమానులు కూడా రిపీటెడ్ గా థియేటర్ కి వచ్చి చూడలేకపోతున్నారు.