పవన్ కల్యాణ్ దానగుణం గురించి చాలామంది తెలుసు. ఒక చేయికి తెలియకుండా ఇంకో చేతితో దానం చేయాలి అనుకునే రకం ఆయన. అందుకే చాలావరకు ఆయన అవసరార్థులకు చేసే సాయం బయటకు రాదు. అతనితో సినిమాల్లో నటించినవాళ్లు, క్లోజ్‌గా ఫాలో అయ్యేవాళ్లకు మాత్రం ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వారి ద్వారా ఆ వివరాలు బయటకు వస్తుంటాయి. తాజాగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమ్మెట గాంధీ నుండి కొన్ని వివరాలు తెలిశాయి.
పవన్ కల్యాణ్ గుప్తదానాలు, సేవా కార్యక్రమాల గురించి గాంధీ చెప్పారు. సెట్‌లో ఎవరికైనా ఏ కష్టమొచ్చినా పవన్ కల్యాణ్ ఆదుకుంటాడని, తన దృష్టికి వచ్చే సమస్యలను తీర్చుతుంటాడని తెలిపారు. ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను సమ్మెట గాంధీ తెలిపారు. సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు సెట్‌కి పవన్‌ను కలవడానికి ఓ జూనియర్ ఆర్టిస్ట్ వచ్చారట. తన కూతురి పెళ్లి కార్డ్ ఇచ్చారట. దానికి పవన్ కల్యాణ్ ‘సాయంత్రం ఓసారి వచ్చి కలువు’ అని చెప్పారట.
దీంతో ఆ జూనియర్ ఆర్టిస్ట్ సాయంత్రం సమయంలో వచ్చి పవన్‌ను కలిశారట. అప్పుడు పవన్ తన పీఏను పిలిచి రూ.లక్ష పెళ్లి కానుకగా ఇచ్చారట. అలా పవన్ కల్యాణ్ ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేశారని సమ్మెట గాంధీ చెప్పుకొచ్చాడు. ఆ మధ్య ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా పవన్ కల్యాణ్ సేవాగుణం గురించి ఇలానే చెప్పుకొచ్చాడు. ఓ మహిళ వచ్చి తన కష్టం చెప్పుకుంటే వెంటనే పవన్ ఆర్థిక సాయమందించారని ఎంతో గొప్పగా చెప్పారు.
అంతేకాదు రైటర్ సత్యానంద్ కూడా మొన్నామధ్య పవన్ కల్యాణ్ చేసిన సాయాల గురించి చెప్పారు . పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రాకముందే తనకు సాయం చేశాడంటూ ఓ సందర్భం గురించి ఆ మధ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సత్యానంద్. తన చెల్లి పెళ్లి అని చెప్పగానే పవన్ కల్యాణ్ వచ్చి డబ్బుల కట్ట చేతుల పెట్టారని సత్యానంద్ నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.