వందేళ్లకు పైగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్నివర్గాలను ఆకట్టుకొంటున్న ‘జంగిల్ బుక్’ చిత్రం తాజా వెర్షన్‌లో హైదరాబాద్‌కు చెందిన పదేళ్ల సంకల్ప్ వాయుపుత్ర కీలకమైన పాత్రను పోషించాడు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారి మోగ్లీకి తెలుగులో సంకల్ప్ తన గొంతును అరువుగా ఇచ్చాడు. ఎలాంటి అనుభవం లేకుండానే తొలిసారి మోగ్లీ పాత్రకు డబ్బింగ్ చెప్పి.. అంతర్జాతీయ సినీ పండితులను మెప్పించాడు. సంకల్ప్ డబ్బింగ్ చెప్పిన తీరు ఆ పాత్రకు జీవం పోసిందని, తెలుగు భాషలో ఈ చిత్రం అత్యంత సహజసిద్ధంగా రూపుదిద్దుకోవడానికి దోహదపడిందనే అభిప్రాయాన్ని హాలీవుడ్ సాంకేతిక నిపుణులు వ్యక్తం చేస్తున్నాడు.
అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పించడానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని చాలా మంది తెలుగు చిన్నారుల గొంతును పరీక్షించగా ఆ అవకాశాన్ని సంకల్ప్ దక్కించుకొన్నాడు. చిన్నతనంలోనే సంకల్ప్ వాక్పటిమ, శైలి, శబ్ద సంపద సీనియర్ డబ్బింగ్ నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అంగ్లభాష విద్యార్థులపై ప్రభావం చూపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాషపై పట్టు సాధించి సంకల్ప్ డబ్బింగ్ చెప్పిన తీరు సినీ పండితులను కూడా ఆకట్టుకున్నది. ఎంతో అనుభవం ఉంటే కానీ డబ్బింగ్ విభాగంలో రాణించడం కష్టంగా మారిన క్రమంలో సంకల్ప్ తొలి అడుగులోనే విశేషంగా రాణించడం ప్రశంసనీయమంటున్నారు.
గత 15 ఏళ్లుగా తెలుగు డబ్బింగ్ విభాగంలో పలు హీరోలకు, అనేక అనువాద చిత్రాలకు పనిచేసిన నాగార్జున వాయుపుత్ర కుమారుడే సంకల్ప్. 1894లో రూపొందించిన చిన్నపిల్లల కథా సంకలనం గత శతాబ్దకాలంలో ప్రతి తరాన్నీ విశేషంగా ఆకర్షిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రఖ్యాత హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ డిస్నీ రూపొందించిన ఈ చిత్రం ఇంగ్లిష్ వెర్షన్‌కు బిల్ ముర్రే, బెన్ కింగ్ స్లే, ఇడ్రిస్ ఎల్బా, స్కార్‌లెట్ జాన్సన్ తదితర దిగ్గజాలు తమ గొంతును అందించారు. హిందీ వెర్షన్‌లో ప్రియాంక చోప్రా, ఇతర బాలీవుడ్ ప్రముఖులు డబ్బింగ్ చెప్పారు. అత్యంత ప్రజాదరణ పొందిన తాజా వెర్షన్ చిత్రంలోని మొగ్లీ పాత్రలో నీల్ సేథీ నటించారు.