పెద్ద సీజన్‌లో పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ముందుగా వచ్చే అతి పెద్ద సమస్య థియేటర్ల సర్దుబాటు. ఈ సమస్య ఎక్కువగా సంక్రాంతి సీజన్‌లోనే వస్తూ ఉంటుంది. అందులోనూ నైజాం ఏరియాలో ఎక్కువగా ఉంటుంది అంటుంటారు. అయితే వచ్చే ఏడాది ఈ సమస్య అంతగా ఉండదు అని చెప్పొచ్చు. ఎందుకంటే సంక్రాంతికి టాలీవుడ్ నుండి వస్తాయి అంటున్న మూడు సినిమాలు ఒకరి నుండే రాబోతున్నాయి కాబట్టి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న లెక్కల ప్రకారం చూస్తే..
సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు తమిళం నుండి ఓ సినిమా, తెలుగు నుండి ఓ చిన్న సినిమా ఉంటాయి. ఆ రెండింటి గురించి ఇప్పటికే ప్రాథమిక సమాచారం ఉన్నా కచ్చితంగా వస్తాయా లేదా అనేది త్వరలో తేలుతుంది. అయితే ఇప్పటివరకు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), ‘డాకూ మహారాజ్’ (Daaku Maharaaj) , ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) అయితే డేట్స్ తేల్చేశాయి. దిల్ రాజు (Dil Raju) నిర్మాణ సంస్థ నుండి వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలు ఉన్నాయి.
ఒకటి రామ్‌చరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాను జనవరి 10న విడుదల చేస్తారు. అక్కడికి నాలుగు రోజుల తర్వాత వెంకటేశ్ (Venkatesh) – అనిల్ రావిపూడి (Anil Ravipudi) ‘సంక్రాంతికి వస్తున్నాం’ వస్తుంది. కాబట్టి ఈ రెండు సినిమాలకు ఈజీగా థియేటర్లు సర్దేస్తారు. అయితే మధ్యలో జనవరి 12న బాలయ్య (Nandamuri Balakrishna) ‘డాకూ మహారాజ్’ వస్తుంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నైజాం, ఉత్తరాంధ్రలో పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ సినిమాను ఆ రెండు ప్రాంతాలకుగాను దిల్ రాజు (Dil Raju) తీసుకున్నారు.
కాబట్టి థియేటర్ల సమస్య లేకుండా ఆయన ప్లాన్ చేసుకుంటారు. దీంతో ఈసారి థియేటర్ల సమస్య పెద్దగా ఉండదు అని చెప్పొచ్చు. అయితే అజిత్ (Ajith) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తోంది. ఒకవేళ వాళ్లు బరిలోకి దిగితే థియేటర్ల దగ్గర చిన్న సమస్య వచ్చి పడుతుంది. మరోవైపు సందీప్ కిషన్ ‘మజాకా’ కూడా సంక్రాంతికి వస్తుందంటున్నారు. ఆ సినిమా విడుదల విషయంలో దిల్ రాజు ముందుకొస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ సినిమా గురించి త్వరలో క్లారిటీ రావొచ్చంటున్నారు.