విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “మెకానిక్ రాకీ” (Mechanic Rocky). శ్రద్ధ శ్రీనాధ్ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఎప్పట్లానే విశ్వక్ (Vishwak Sen) భారీ స్థాయిలో ప్రమోట్ చేసిన ఈ చిత్రం ఆడియన్స్ వరకు బాగా రీచ్ అయ్యింది. ఈవారం విడుదలవుతున్న సినిమాల్లో ఇదే పెద్దది అని చెప్పొచ్చు. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలిగింది? అనేది చూద్దాం..!!
Mechanic Rocky Review
కథ: మలక్ పేటలో తండ్రి (నరేష్) నేతృత్వంలో ఆర్.కె గ్యారేజ్ మరియు డ్రైవింగ్ స్కూల్ చూసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు రాకేష్ అలియాస్ మెకానిక్ రాకీ (విశ్వక్ సేన్) (Vishwak Sen). అతడి జీవితంలోకి అనుకోకుండా ఎంట్రీ ఇస్తాడు రంకిరెడ్డి (సునీల్), దాంతో ఎన్నో సమస్యల్లో చిక్కుకుంటాడు. ఆ సమస్యల నుండి గట్టెక్కించడానికి ఎంట్రీ ఇస్తుంది మాయ (శ్రద్ధ శ్రీనాధ్). ఆమె ఇచ్చిన మోరల్ సపోర్ట్ తో ముందుకు వెళ్ళిన రాకీ అగాధంలోకి కూరుకుపోతాడు.
అసలు రాకీకి వచ్చిన సమస్య ఏమిటి? దాన్నుంచి బయటపడదానికి మాయ ఎలా సహాయపడింది? అసలు మాయ ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే “మెకానిక్ రాకీ” చిత్రం.
నటీనటుల పనితీరు: విశ్వక్(Vishwak Sen) కి ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి. చాలా ఈజ్ తో చేసేశాడు. పెద్దగా కష్టపడినట్లు ఎక్కడా కనిపించలేదు. కామెడీ టైమింగ్ లో కాస్త ఇంప్రూవ్ అయ్యాడు కూడా. లుక్స్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త పాటించాలి. కాలేజ్ సీన్స్ లో కాస్త బొద్దుగా ఉండడంతో తేలిపోయాడు. శ్రద్ధ శ్రీనాధ్ అంత ఈజీగా సినిమాలు ఒప్పుకొనే రకం కాదు. ఆమె పోషించే పాత్రకి బరువైన ఎమోషన్ కానీ ఎలివేషన్ కానీ లేకపోతే ఆమె క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయదు. ఈ సినిమా ఆమె ఎందుకు అంగీకరించింది అనేది “మెకానిక్ రాకీ” చూశాక అర్ధమవుతుంది. ఫస్టాఫ్ లో చాలా రెగ్యులర్ గా ఉన్న ఆమె రోల్, సెకండాఫ్ కి వచ్చేసరికి మంచి ట్విస్ట్ తో కథనంలో వేగాన్ని పెంచింది.
ఆమె ఆ రెండు వేరియేషన్స్ ను పోషించిన విధానం కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. మీనాక్షీ చౌదరికి నటించే స్కోప్ ఉన్న పాత్ర లభించినా ఎందుకో బేలమొహం వేసింది. నటిగా ఆమె పరిణితి చెందాల్సింది చాలా ఉందని ఈ సినిమాతో అర్ధమైంది. నటి అంటే నవ్వడం మాత్రమే కాదు ఏడ్వడమూ రావాలి మరి.
నరేష్ కామెడీ టైమింగ్ తో మరోసారి ఆకట్టుకున్నారు. ఓ సగటు తండ్రిగా ఆయన పాత్రకు చాలా మంది యూత్ కనెక్ట్ అవుతారు. హర్షవర్ధన్ & వైవా హర్షలు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా నటీనటులు పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: జేక్స్ బిజోయ్ పాటలు సోసోగా ఉన్నా, నేపధ్య సంగీతంతో మాత్రం అలరించాడు. విశ్వక్ సేన్ (Vishwak Sen) ఎలివేషన్ ర్యాప్ బాగుంది. అలాగే.. ఎమోషన్స్ సీన్స్ కి కూడా మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఛేజింగ్ సీన్స్ ను చాలా ఎంగేజింగ్ గా పిక్చరైజ్ చేశాడు. సగం సినిమా ఆ గ్యారేజ్ లోనే సాగిన ఎక్కువ రిపీటెడ్ షాట్స్ లేకుండా జాగ్రత్తపడ్డాడు.
ఆర్ట్ & ప్రొడక్షన్ డిజైన్ వర్క్ డీసెంట్ గా ఉంది. ముఖ్యంగా మెకానిక్ షెడ్ చాలా నేచురల్ గా డిజైన్ చేశారు. దర్శకుడు రవితేజ ముళ్ళపూడి ఎంచుకున్న కథలో మంచి డెప్త్ ఉంది. నిజానికి ఈ కథలో కామెడీని ఇరికించకుండా మంచి థ్రిల్లర్ లా తెరకెక్కించి ఉంటే మరో రేంజ్ లో ఉండేది సినిమా. మంచి స్కోప్ ఉన్న కథ. ఫస్టాఫ్ కథను ఎస్టాబ్లిష్ చేయడానికి వదిలేశాడు కానీ, సెకండాఫ్ మాత్రం నీట్ గా తెరకెక్కించాడు. ఫస్ట్ టైమ్ డైరెక్షన్ అంటే బాగానే హ్యాండిల్ చేశాడనే చెప్పాలి. ఫస్టాఫ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా కచ్చితంగా మంచి హిట్ అయ్యేది.
అయితే.. శ్రద్ధ శ్రీనాధ్ క్యారెక్టరైజేషన్ ను రాసుకున్న విధానం మాత్రం బాగుంది. అయితే.. ఇంత హడావుడి చేసేది కేవలం 20 లక్షల కోసమా? అనేది మాత్రం కన్విన్సింగ్ గా లేదు. ఆ ఎమౌంట్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. బహుశా సినిమా మెయిన్ థీమ్ ఎక్కడ ఇప్పటికే విడుదలైన వేరే సినిమాలతో కంపర్ చేసేస్తారో అని సదరు నిర్ణయం తీసుకొని ఉండొచ్చు కానీ.. అది కాస్త తేడా కొట్టిందనే చెప్పాలి. సొ, కథకుడిగా పర్వాలేదనిపించుకున్న రవితేజ, దర్శకుడిగా మాత్రం బొటాబోటి మార్కులతో నెట్టుకొచ్చాడు.
విశ్లేషణ: ఒక కథను ఇలానే, ఈ జోనర్ లోనే తీయాలి అనే రూల్ ఏమీ లేదు కానీ, కొన్ని కథలకి కొన్ని జోనర్స్ సెట్ అవుతాయి. సదరు జోనర్ లో ఆ కథను ఇంకాస్త నీట్ గా ఎలివేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు “ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ”ను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించి ఉంటే ఆ స్థాయిలో ఆకట్టుకొని ఉండేది కాదేమో. అలాగే.. “మెకానిక్ రాకీ” (Mechanic Rocky) కథను కూడా చెప్పాల్సిన విధంగా కాకుండా కామెడీ జోన్ లో చెప్పాలనుకోవడం కథకి ఉన్న కెపాసిటీని కాస్త డ్యామేజ్ చేసింది. అయితే.. మాస్ ఆడియన్స్ ను మాత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకునే సినిమా ఇది. శ్రద్ధ శ్రీనాధ్ క్యారెక్టరైజేషన్, విశ్వక్ కామెడీ టైమింగ్, జేక్స్ బిజోయ్ నేపధ్య సంగీతం మరియు సెకండాఫ్ కోసం ఈ సినిమాని థియేటర్లలో ఒకసారి ట్రై చేయొచ్చు.
ఫోకస్ పాయింట్: డీజిల్ ఇంజన్ లో పెట్రోల్ పోసావ్ రాకీ!