టాలీవుడ్‌కి బాగా కలిసొచ్చేది, నిర్మాతలు కావాలనుకునే సీజన్ ‘సంక్రాంతి’. ఈ టైమ్‌కి సినిమాలు సిద్ధం చేయాలని మన హీరోలు కూడా అనుకుంటూ ఉంటారు. వరుస సెలవులు, పండగ వాతావరణం… గ్రామాల నుండి పక్కనున్న ఊళ్లకు జనాలు వచ్చే అవకాశం… ఇలా సంకురాతిరికి మంచి ఊపే ఉంటుంది. ఏటా సంక్రాంతిలాగే వచ్చే ఏడాది కూడా టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర దుమ్ము రేగబోతోంది. అయితే ఆ పని చేసేదెవరు అనేదే ఇక్కడ ప్రశ్న. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇప్పటికే సిద్ధమవుతోంది. మిగిలిన సినిమాల విషయమే తేలడం లేదు.
తొలుత అనుకున్నదాని ప్రకారం… సంక్రాంతికి ‘భీమ్లా నాయక్’ (జనవరి 12), ‘సర్కారు వారి పాట’, ‘రాధేశ్యామ్’ ( జనవరి 14)న విడుదల కావాలి. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ రాకతో మిగిలిన సినిమాలు వెనక్కి వెళ్తున్నాయి. అయితే ప్రభాస్ మాత్రం వెళ్లడు అంటున్నారు. దీంతో సంకురాతిరి సినిమాల లెక్క తేలలేదు. ‘ఆచార్య’, ‘ఎఫ్ 3’ ఫిబ్రవరిలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో పొంగల్ ఫైట్‌లోకికొత్త సినిమా వచ్చిందని వార్తలొస్తున్నాయి. అదే నాగార్జున ‘బంగార్రాజు’. టాలీవుడ్‌లో వస్తున్న పుకార్ల ప్రకారం చూస్తే…
సంక్రాంతికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఒక్కటే బరిలో ఉండొచ్చు. ‘రాధేశ్యామ్’ కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో ‘బంగార్రాజు’ ఈలోపు పూర్తి చేసి బరిలోకి దింపాలని నాగార్జున అనుకుంటున్నారట. దీని కోసం దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ గట్టిగానే ట్రై చేస్తున్నారని టాక్. సినిమా బౌండెడ్ స్క్రిప్ట్‌తో బరిలోకి దిగడం వల్ల వేగంగానే పూర్తయ్యే అవకాశం ఉందని టాక్.