కొన్ని రోజులుగా చెలరేగుతున్న వివాదం నేడు చల్లారింది. కర్ణాటక ప్రజలను కుక్కలని దూషించినందుకు సత్యరాజ్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే బాహుబలి కంక్లూజన్ ని కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకుంటామని అక్కడి వాసులు కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్నారు. మరో వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాహుబలి కంక్లూజన్ రిలీజ్ అవుతుండగా ఈ సమస్య చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది. ఈ విషయం పై నిన్న రాజమౌళి కన్నడ వాసులకు క్షమాపణలు కూడా చెప్పారు. అయినా వారు శాంతించకపోవడంతో సత్యరాజ్ ఈరోజు వీడియోని అప్ లోడ్ చేశారు. ” తొమ్మిదేళ్లకు ముందు నేను మీ గురించి తప్పుగా మాట్లాడాను. ఆ సంఘటనను అందరూ మరిచి పోయారు. నేను నటించిన 30 సినిమాలను ఆదరించారు. బాహుబలి బిగినింగ్ ని కూడా హిట్ చేశారు.
అయితే నేను మాట్లాడిన వీడియోని యూట్యూబ్ లో ఇప్పుడు చూసిన కొందరికి బాధకలిగి బాహుబలి కంక్లూజన్ విడుదలను ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. నేను కన్నడ ప్రజలకు ఎప్పుడూ వ్యతిరేకిని కాను. బాహుబలి సినిమా నిర్మాణంలో భాగమైన వేలమంది కార్మికుల్లో నేనొక చిన్న కార్మికుడిని మాత్రమే. నా వల్ల ఆ సినిమాకి నష్టం రాకూడదు. అందుకే నా మాట వల్ల బాధ పడ్డ ప్రతి ఒక్కరికీ క్షమాపణలు” అంటూ సత్యరాజ్ వీడియోలో పేర్కొన్నారు. సత్యరాజ్ క్షమాపణలకు కన్నడ ప్రజలు శాంతించారో, లేదో మరికొన్ని గంటల్లో తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.