రామ్ గోపాల్ వర్మ దగ్గర సర్కార్ నుంచి రక్త చరిత్ర వరకు పని చేసిన మోహన్ బమ్మిడి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం “గువ్వ గోరింక”. విభిన్న పాత్రలు చేస్తూ, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న సత్యదేవ్ హీరోగా నటించగా, ప్రియాలాల్ హీరోయిన్ గా నటించింది. దాము రెడ్డి కొసనం, దళం జీవన్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 17న అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ బమ్మిడి మాట్లాడుతూ, తెలుగు సినీ ఓటీటీ ట్రెండ్ ను ఈ చిత్రం మారుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతి తక్కువ రోజుల్లో చాలా లిమిటెడ్ బడ్జెట్ ఉపయోగించి కనుల పండువగా తీశామని అన్నారు.
ఇపుడున్న పరిస్థితులలో మంచి క్యాలిటీ సినిమా తీసి ఓటీటీ ప్రేక్షకులను మెప్పించడం ఎలా? అని పరిశ్రమలో ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు. అలాంటి వాళ్లకు ఈ చిత్రం ఓ గైడ్ లాంటిదని అన్నారు. సత్యదేవ్ వంటి రైజింగ్ హీరోతో చేసిన ఈ సినిమాకు బాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేసారని ఆయన తెలిపారు మానవ సంబంధాలను యువత ఎలా చూస్తున్నారన్న అంశాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించామని ఆయన చెప్పారు. హీరో సత్యదేవ్ తన పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారని, హీరోయిన్ ప్రియాలాల్ కూడా పోటీపడి నటించిందని, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరిందని చెప్పారు. ఈ సినిమాలో ప్రియదర్శి, చైతన్య, ప్రభాకర్, ఫిష్ వెంకట్ తదితరులు తారాగణం. ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: మైలేసం రంగస్వామి, ఆర్ట్: సాంబశివరావు, ఎడిటింగ్ ప్రణవ్ మిస్త్రి, నిర్మాతలు: దాము రెడ్డి కొసనం, దళం జీవన్ రెడ్డి, దర్శకత్వం: మోహన్ బమ్మిడి.