మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఉన్నట్లే.. కొన్ని వ్యాధులు కూడా ఉన్నాయి. అందులో చాలా ప్రమాదకరమైనది “సెకండ్ సినిమా సిండ్రోమ్”. మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టి, రెండో సినిమాకి ఫ్లాప్ కొట్టేవాళ్ళని ఈ “సెకండ్ సినిమా సిండ్రోమ్” ఎఫెక్ట్ కొట్టింది అంటారు. ఈ సిండ్రోమ్ బారినపడకుండా తప్పించుకున్న అతి తక్కువమంది “రాజమౌళి (S. S. Rajamouli) , బోయపాటి (Boyapati Srinu) , కొరటాల శివ” (Koratala Siva) తదితరులు అన్నమాట. ఇక ఈ సిండ్రోమ్ బారినపడ్డోళ్ల లిస్ట్ కి లెక్కలేదు అనుకోండి.
Hasith Goli
తాజాగా ఈ లిస్ట్ లోకి వచ్చి చేరాడు హసిత్ గోలి (Hasith Goli) . తొలి చిత్రం “రాజ రాజ చోర”తో (Raja Raja Chora) డీసెంట్ హిట్ అందుకున్న దర్శకుడు హసిత్, రెండో సినిమా కూడా అదే నిర్మాత, అదే హీరో కాంబినేషన్ లో “శ్వాగ్” (Swag) రూపంలో సెట్ చేసుకున్నాడు. శ్రీవిష్ణు (Sree Vishnu) -రీతూవర్మ (Ritu Varma) ప్రధాన పాత్రల్లో హసిత్ గోలి (Hasith Goli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదలైంది. ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. కట్ చేస్తే.. విడుదలైన మొదటి షో నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ రాకపోగా..
సినిమాని అర్థం చేసుకోవడానికి కూడా జనాలు ఇబ్బందిపడుతున్నారని రివ్యూలు వచ్చాయి. దాంతో సినిమా కలెక్షన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. శుక్రవారం, శనివారం, ఆదివారం కలుపుకొని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 3.2 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే 6.5 కోట్ల రూపాయల షేర్ సాధించాలి. ప్రస్తుతం సినిమా రన్ బట్టి ఆ స్థాయి షేర్ సాధించడం అనేది కష్టం అని తెలుస్తోంది.
అయితే.. సినిమా ఫ్లాప్ కి చేరువలో ఉన్నప్పటికీ, నటుడిగా శ్రీవిష్ణు స్థాయిని మాత్రం కచ్చితంగా పెంచింది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీవిష్ణు నపుంసకుడిగా నటించిన విధానం ప్రశంసార్హం. నిజానికి ఈ తరహా సినిమాలు హిట్ అయితే బాగుండు అనిపిస్తాయి. ఎందుకంటే.. ఈ సినిమా రిజల్ట్ బట్టి మరింతమంది ఈ తరహా బోల్డ్ కాన్సెప్ట్ లతో సినిమాలను తెరకెక్కించే అవకాశాలు ఉంటాయి. అయితే.. “శ్వాగ్” పాయింట్ బాగున్నా సినిమాగా చూడడానికి అంత కన్విన్సింగ్ గా లేదు. అందుకే సినిమా హిట్ స్టేటస్ సాధించలేకపోయింది.