జానీ మాస్టర్ – మహిళా కొరియోగ్రాఫర్ వ్యవహారం ఎక్కడివరకు, ఎక్కడ ముగుస్తుంది అనే విషయంలో అప్పుడే ఓ స్పష్టతకు రాలేము కానీ.. ఇప్పుడు అయితే జానీ మాస్టర్ కెరీర్‌లో ఎవరూ ఊహించని, ఎవరూ కోరుకోని దెబ్బ తగిలింది. ఇండస్ట్రీలోకి అందరూ కష్టాలు ఎదుర్కొనే వస్తారు. అలా వచ్చినవాళ్లకు రెమ్యూనరేషన్‌తోపాటు పురస్కారం ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి ఓ కీలక పురస్కారం ఇప్పుడు ఆయనకు రాకుండా హోల్డ్‌లో పడిపోయింది. అవును, షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌కు ఇటీవల జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా పురస్కారం అనౌన్స్ చేశారు.
Jani Master
తమిళ చిత్రం ‘తిరు’లో ఆయన కంపోజ్ చేసిన డ్యాన్స్‌కుగాను ఆ అవార్డు అందుకోవాల్సి ఉంది. దీని కోసమే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు కూడా. అయితే ఇప్పుడు ఆ పురస్కారాన్ని హోల్డ్‌లో పెట్టారు. జానీకి ప్రకటించిన జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది. 2022 సంవత్సరానికిగాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ ఎంపికయ్యారని, ఈ నెల 8న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో పురస్కారం అందుకోవాల్సి ఉందని, అయితే తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ నృత్యదర్శకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదు కావడంతో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ అభియోగాల నేపథ్యంలో అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, ఆహ్వాన పత్రికను రద్దు చేస్తున్నట్లు అవార్డుల సెల్ ప్రకటనలో పేర్కొంది. దీంతో కేసు విషయం తేలేంతవరకు జానీ మాస్టర్ ఆ పురస్కారాన్ని అందుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఆరోపణలు నిజమైతే.. అవార్డు రద్దు చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
ఇక ఇదే పురస్కార కార్యక్రమానికి వెళ్లడానికి జానీ మాస్టర్‌కు న్యాయస్థానం అక్టోబరు 6 నుండి 9 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఆ బెయిల్ మీదనే ఆయన బయట ఉన్నారు. అవార్డు హోల్డ్‌లో పడిన కారణంగా ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.