తమిళ యంగ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కిన చిత్రం “సీమరాజా”. సమంత, కీర్తి సురేష్ కథానాయికలుగా నటించిన ఈ రూరల్ మాస్ ఎంటర్ టైనర్ ను అదే పేరుతో తెలుగులో నేడు విడుదల చేశారు. తమిళంలోనే యావరేజ్ సినిమాగా నిలిచిన ఈ చిత్రానికి తెలుగులో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం..!
కథ: ఓ పల్లెటూరిలో తన తాతల ఆస్తులను ఎంజాయ్ చేస్తూ, ఇష్టమొచ్చినట్లు దానాలు చేస్తూ టైమ్ పాస్ చేస్తుంటాడు సీమ రాజా (శివకార్తికేయన్), అన్నీ సినిమాల వలే ఈ సినిమాలోనూ విలన్ కూతురు లక్ష్మీ (సమంత)ను ప్రేమిస్తాడు సీమ రాజా. ఆమెతో సరస సల్లాపాలు కొనసాగిస్తున్న తరుణంలో తాను ఊరి ప్రజలకు న్యాయం చేయాలని తెలుసుకొని ప్రయత్నం మొదలెడతాడు సీమ రాజా. అందుకు కృష్ణ మరియు అతడి భార్య (సిమ్రాన్) అడ్డుపడతారు. ఆ అడ్డంకిని సీమరాజా ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: శివకార్తికేయన్ ఎప్పట్లానే తన ఎనర్జీటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా.. అతడి స్నేహితుడిగా సూరి.. ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడుగా మంచి కామెడీతో అలరించాడు. సమంత రెగ్యులర్ హీరోయిన్ రోల్లో పర్వాలేదనిపించింది. కానీ.. క్లైమాక్స్ లో మాత్రం కర్ర ఫైట్ తో అదరగొట్టింది. నెగిటివ్ రోల్లో సిమ్రాన్ పెర్ఫార్మెన్స్ ఇరగ్గోట్టేసింది. కీర్తి సురేష్ ది చిన్న పాత్రే అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించింది. సాంకేతికవర్గం పనితీరు: డి.ఇమ్మాన్ సంగీతం, బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. దర్శకుడు పొన్ రామ్ కథను పక్కన పెట్టేసి కథనాన్ని మాత్రం బాగా సాగదీశాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నిట్నీ ఇరికించడం కోసం రాసుకున్న సన్నివేశాలు కొన్ని బాగానే ఉన్నా.. కొన్ని మాత్రం రొటీన్ అనిపిస్తాయి. ముఖ్యంగా లేకి కామెడీ చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ.. మాస్ ఎలిమెంట్స్ మాత్రం మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకొంటాయి.
విశ్లేషణ: టైమ్ పాస్ కోసం ఒకసారి హ్యాపీగా చూడదగ్గ సినిమా “సీమ రాజా”. కాకపోతే.. మధ్యలో కాస్త బోర్ కొడుతుంది.