సినిమా రంగంలో ఒక్క ఛాన్స్ కోసం అమ్మాయిలు మానాన్నితాకట్టు పెడుతుంటే.. అబ్బాయిలు డబ్బులు ఇవ్వడానికి సై అంటున్నారు. ఆ వీక్ నెస్ ని కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల కొత్త సినిమాలో అవకాశం ఇప్పిస్తానని కాస్టింగ్ డైరెక్టర్ సంజయ్ కొంతమంది యువకుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ విషయం శేఖర్ వద్దకు చేరడంతో తొందరగానే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ మోసగాడిని పెట్టుకునేలా చేశారు. ఈ సందర్భంగా కమ్ముల ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేశారు. ‘‘సంజయ్ అనే వ్యక్తి కాస్టింగ్ డైరెక్టర్ పేరుతో ప్రకటనలు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నాడని నా దృష్టికి వచ్చింది. బాధితుల్లో ఒకరైన ఒంగోలుకి చెందిన ప్రదీప్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి మా ఆఫీస్ కి వచ్చి ఈ విషయాన్ని మాకు చెప్పాడు.
నేను వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాను. ఒక వారంలోనే ఈ మోసగాడిని సైబర్ పోలీసులు పట్టుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులకు థాంక్స్. అవకాశాలు ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మకండి. నిజానికి ఏదైనా పాత్రకు ఎంపికైతే మేమే డబ్బులిస్తాం. నా సినిమాలకు సంబంధించిన నటీనటుల ఎంపికను నేను.. నా డైరెక్షన్ టీమే చూసుకుంటాం. మా నుంచి కాల్ వస్తేనే నమ్మండి. ఇంకెవరు మోసం చేయాలని చూసినా జాగ్రత్త’’ అని స్పష్టం చేశారు. సినీ ప్రముఖులు ఇలా యాక్టివ్ గా ఉండడం వల్ల మోసగాళ్ల ఆగడాలను అరికట్టేందుకు వీలుగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.