ప్రముఖ స్టార్ హీరో కార్తీక్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం చెన్నై ఫిలిం వర్గాలను కలవరపెడుతుంది. శనివారం నాడు సాయంత్రం ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఈయన్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చెన్నైలోని అడయార్‌లోని ఫోర్టిస్ మలార్ ఆసుపత్రిలో ఈయన్ని చేర్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఈయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో ఉన్నారని తెలుస్తుంది. కార్తీక్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వెంటనే.. మొదట కోవిడ్ టెస్టులు చేశారట. రిపోర్ట్స్ లో నెగిటివ్ వచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం ఈయన పరిస్థితి ఎలా ఉంది అనే విషయం పై ఇంకా స్పష్టత రాలేదు. కొద్దికాలం నుండీ రాజకీయాల్లో ఈయన బిజీగా ఉండి కేంపెయినింగ్ చెయ్యడంతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసినట్టు తెలుస్తుంది. అప్పట్లో ప్రేమ కథా చిత్రాలతోనే రికార్డులను కొట్టే వారు కార్తీక్. తమిళంలో ఈయనో పెద్ద స్టార్ హీరో. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితమే. భారతీ రాజా డైరెక్షన్లో వచ్చిన ‘సీతాకోక చిలుక’ చిత్రంతో ఈయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
అటు తరువాత ‘అనుబంధం’, ‘అన్వేషణ’, ‘పుణ్య స్త్రీ’, ‘అభినందన’ ‘గోపాల రావు గారి అబ్బాయి’ ‘మగరాయుడు’ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. ఇందులో ‘అన్వేషణ’ ‘అభినందన’ చిత్రాలు పెద్ద హిట్లు అయ్యాయి. ఇక ‘అభినందన’ సినిమాలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘ఓం 3డి’ మూవీలో కూడా ఈయన విలన్ గా నటించారు.