పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులైంది. 2013లో వచ్చిన ‘మిర్చి’ తర్వాత అతను మరో మాస్ సినిమాలో నటించలేదు. ‘బాహుబలి’ కంప్లీట్ గా పీరియాడికల్ డ్రామా, ‘సాహో’ కంప్లీట్ యాక్షన్ మూవీ, రాధే శ్యామ్ ప్యూర్ లవ్ స్టోరీ, ఇక ‘ఆదిపురుష్’ అయితే మైథలాజికల్ మూవీ. సో ప్రభాస్ నుండి ఓ మాస్ సినిమా వచ్చి 10 ఏళ్ళు దాటింది. ప్రభాస్ సెప్టెంబర్ 28 న ‘సలార్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన (Salaar) ఈ మూవీ కంప్లీట్ గా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ చిత్రం ‘కె.జి.ఎఫ్’ కి మించి ఉంటుంది అంటుంది ఓ నటి. ఆమె మరెవరో కాదు శ్రియా రెడ్డి. గతంలో విశాల్ నటించిన ‘పొగరు’ సినిమాలో నటించింది. ‘సలార్’ లో ఈమె ఓ కీలక పాత్ర పోషించింది. ‘సలార్’ గురించి ఆమె మాట్లాడుతూ.. ” ‘సలార్’ మూవీ ‘కేజీఎఫ్’ లా కాదు ‘కె.జి.ఎఫ్’ ని మించి ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్ చూడలేదు.
ప్రశాంత్ నీల్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లా ఓ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ప్రభాస్ ఇప్పటి వరకు చూడని విధంగా కనిపిస్తారు. ప్రభాస్ స్క్రీన్ పై కనిపించగానే ప్రేక్షకులకి గూజ్ బంప్స్ రావడం ఖాయం. సినిమాలోని ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ – ప్రభాస్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ కూడా మాస్ ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి” అంటూ శ్రియా రెడ్డి చెప్పుకొచ్చింది.